హోదా, నిర్మలా సీతారామన్: తిడుతున్నా... బీజేపీపై బాబు మౌనం వెనుక!
విజయవాడ: బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు పట్ల అనుమానం కలుగుతోందంటున్నారు.. కమలం పార్టీ వర్గాలు. ప్రత్యేక హోదా, నిధులు తదితర విషయాల్లో సొంత పార్టీ నేతల దూకుడును ఆయన ఎందుకు అడ్డుకోలేకపోతున్నారనే చర్చ సాగుతోంది.
ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు, జాతీయ ప్రాజెక్టులకు నిధులు తదితర అంశాలపై బీజేపీ - టిడిపి మధ్య ఇటీవలి కాలంలో మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు మాత్రం ఓ వైపు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. బీజేపీతో సన్నిహితంగా ఉంటామని చెబుతున్నారు.
చంద్రబాబు అసంతృప్తి బయటకు కనిపిస్తున్నప్పటికీ, బీజేపీ పైన విరుచుకు పడటం లేదు. కేంద్రంతో సన్నిహితంగా ఉండటమే ముఖ్యమని చెబుతున్నారు. కానీ టిడిపి నేతలు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

చంద్రబాబు వారిని ఆపలేకపోతున్నారా లేక ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నారా, ఆపొద్దని భావిస్తున్నారా అనే చర్చ సాగుతోంది. ఇది బీజేపీ పైన చంద్రబాబు మార్క్ రాజకీయం కావొచ్చని అంటున్నారు. టిడిపి నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి నేతలు హోదా విషయంలో బీజేపీని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
చంద్రబాబు వారిని ఎందుకు వారించడం లేదని బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో అనుమానం కలుగుతోంది. చంద్రబాబు ఉద్దేశ్య పూర్వకంగానే వారి పట్ల మౌనంగా ఉంటున్నట్లుగా కనిపిస్తోందని, ఆయన మాత్రం స్నేహం కోరుకుంటామని చెబుతున్నారని, ఇది ఆయన మార్క్ రాజకీయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా.. కేంద్రం నుంచి సరైన సహకారం లేదని, హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెబుతూ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీతో స్నేహం కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. టీడీపీ నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు.
సోమవారం నాడు ఏపీలో పలుచోట్ల మినీ మహానాడు జరిగింది. ఈ సమావేశాల్లో టిడిపి నేతలు బీజేపీని తప్పుబట్టే ప్రయత్నం చేశారు. హోదా విషయంలో తాము ప్రయత్నాలు చేస్తున్నామని, బీజేపీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుంటే దోషిగా నిలబడుతుందని హెచ్చరించారు.
నెల్లూరులో టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే బీజేపీపై దుమ్మెత్తి పోశారు. ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని, రెండేళ్లు గడచినా ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు విడుదల్లో స్పష్టత లేదన్నారు.
విభజన చట్టంలో ప్రత్యేక రైల్వే జోన్ ఉన్నా కార్యరూపం దాల్చలేదని, 2014 ఎన్నికల్లో నెల్లూరు సభలో వెంకయ్య నాయుడు సమక్షంలో మోదీ ప్రత్యేక హోదా పదేళ్ల పాటు ఏపీకి ఇస్తామని హామీ ఇచ్చారని, ప్రధాని అభ్యర్థిగా మోడీ ఆనాడు ఎన్నికల వాగ్దానం నమ్మి ప్రజలు ఓట్లు వేశారన్నారు.
ఇప్పుడు మాట తప్పితే వారు నమ్మరన్నారు. రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటిస్తే పదేళ్లు ఇవ్వాలని రాజ్యసభలో బీజేపీ డిమాండ్ చేసిందన్నారు. ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదని, అందుకే హోదా ఇవ్వలేమని తేల్చడం సరికాదన్నారు.
రాష్ట్ర విభజన నాటికి రూ.16 వేల కోట్ల లోటు ఉందని, దీనిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చి రూ.2,600 కోట్లతో సరి పెట్టారని, ఎలా బతకాలో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. కేంద్రం సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి జరగాలని రవాణా మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. రాజధాని నిర్మాణానికి అన్ని రకాలుగా కేంద్రం సాయం చేయాలని, లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని మరో మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు.
నిర్మలా సీతారామన్‌ను చూపించి...!
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి ఏపీ కోటా నుంచి మూడు సీట్లు దక్కనున్నాయి. సుజనా చౌదరికి మరోసారి అవకాశం దక్కనుంది. బీజేపీ నేత, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పరిస్థితే ఎటూ తేలడం లేదు. తమిళనాడుకు చెందిన నిర్మలా తెలుగింటి కోడలైన నేపథ్యంలో గతంలో టీడీపీ ఆమెను ఏపీ కోటాలో రాజ్యసభకు పంపించింది.
ఈ క్రమంలో ఈ దఫా కూడా నిర్మలను ఏపీ కోటా నుంచే రాజ్యసభకు పంపాలని బీజేపీ తన మిత్రపక్షం టీడీపీని కోరనుంది. గడచిన ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ, బీజేపీలు మంచి ఫలితాలను రాబట్టాయి. అయితే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీ సర్కారు చేస్తున్న జాప్యంతో ఇరు పార్టీల మధ్య గతంలోలా మంచి సంబంధాలు లేవు.
అయినా ఏపీ కోటాలో నుంచే నిర్మలను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ యత్నిస్తోంది. ఈ క్రమంలో నేడు అసోం సీఎంగా సర్బానంద సోనోవాల్ పదవీ ప్రమాణం చేయనున్న కార్యక్రమానికి వెళుతున్న చంద్రబాబుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గౌహతిలో కీలక చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు.. నిర్మలను తమ కోటా కింద రాజ్యసభకు పంపితే తమకేమీస్తారని షాను అడగనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications