ఎస్పీ ముసలం-అఖిలేష్‌కు పోటీ: ఎవరీ అపర్ణ? మోడీకి మద్దతుదారేనా?
లక్నో: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి అధికార సమాజ్‌వాదీ పార్టీలో ముసలం చెలరేగింది. ప్రస్తుతం సీఎం పదవిలో కొనసాగుతున్న అఖిలేష్ యాదవ్‌ను ఆయన తండ్రి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో యూపీలో రాజకీయాల్లో తీవ్రంగా వేడెక్కిపోయాయి.
శనివారం ఇరువురు నేతలు తమ మద్దతుదారులతో సమావేశం కూడా నిర్వహించారు. అయితే, తన తండ్రితో తనకు ఎలాంటి విభేదాలు లేవని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీని గెలిపించి తన తండ్రికి కానుకగా ఇవ్వడమే తన లక్ష్యమని కంటతడి పెడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కాగా, ఎస్పీలో ఈ ముసలం చోటుచేసుకోవడానికి ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ కూడా ఓ కారణమంటూ ప్రచారం జరుగుతోంది.
అసలు విషయంలో వెళితే.. తాజాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తండ్రీ కొడుకులు ములాయం, అఖిలేష్ విడివిడిగా పార్టీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించడంతో మరోసారి సంక్షోభానికి దారితీసింది. అయితే అఖిలేశ్ యాదవ్ ప్రకటించిన జాబితాలో లక్నో కంటోన్మెంట్ సీటు అభ్యర్థి పేరు లేకపోవటం రాజకీయ వర్గాల్ని విస్మయానికి గురిచేశాయి. అయితే, ఆ సీటు అభ్యర్థిగా ఏడాది కిందటే అపర్ణాయాదవ్ పేరును ఎస్పీ చీఫ్ ములాయం రిజర్వు చేశారు. అలాంటిది అఖిలేశ్ మాత్రం తాను సమర్పించిన జాబితాలో అపర్ణ పేరును చేర్చలేదు. ఇది కూడా ఎస్పీలో సంక్షోభానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

అపర్ణ నేపథ్యం
అపర్ణా బిష్త్ యాదవ్ విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి అరవింద్ సింగ్ బిష్త్ టైమ్స్ ఆఫ్ ఇండియా లక్నో బ్యూరో చీఫ్‌గా పని చేస్తున్నారు. అపర్ణ లక్నోని ఓ ప్రఖ్యాత పాఠశాలలో చదువుకున్నారు. అక్కడే ప్రతీక్ యాదవ్ కూడా చదువుకున్నారు. కాగా, అప్పట్లో ప్రతీక్ యాదవ్‌కు ములాయంకు మధ్య సంబంధం లోకానికి తెలియదు. వీరి బంధాన్ని 2007లో ములాయం బయటపెట్టారు.
కాగా, అపర్ణ, ప్రతీక్‌లు తొలుత సన్నిహిత మిత్రులు. తర్వాత వీరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రతీక్ నేపథ్యం తెలియకుండానే దగ్గరయ్యారు. ఆమె తొలిసారి ప్రతీక్ తల్లివద్దకు వెళ్లినప్పుడే ములాయం కుమారుడన్న విషయం తెలిసింది. వీరిద్దరు ఇంగ్లాండ్‌లో ఉన్నత చదువులు అభ్యసించారు. అపర్ణ అంతర్జాతీయ సంబంధాల్లో మాస్టర్స్ డిగ్రీ చేయగా ప్రతీక్ మేనేజ్‌మెంట్‌లో ఎమ్మెస్సీ చేశారు.
అప్పట్లో వీరి ప్రేమను అపర్ణ తండ్రి అరవింద్ మొదట అంగీకరించలేదు. ఆ తర్వాత అపర్ణ, ప్రతీక్‌ల పెళ్లికి ములాయం అంగీకరించకలేదు. అయితే, సాధన గుప్తా ప్రమేయంతో ములాయం వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. అనంతరం అపర్ణ, ప్రతీక్‌ల పెళ్లిని ములాయం ఎంతో వైభవంగా చేశారు.

తెరపైకి అపర్ణ యాదవ్
ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్యే ఈ 26ఏళ్ల అపర్ణ యాదవ్. ప్రతీక్ యాదవ్ ప్రస్తుతం ఫిట్‌నెస్ వ్యాపారంలో ఉండటంతో అపర్ణాయాదవ్ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఆమెను లక్నో కంటోన్మెంట్ సీటుకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ స్థానంలో రీటా బహుగుణా జోషీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, ఏడాది నుంచే అపర్ణ యాదవ్ తన ప్రచారాన్ని ప్రారంభించడం గమనార్హం.

మోడీఖే అపర్ణ మద్దతు?
కాగా, అపర్ణ ప్రధాని నరేంద్ర మోడీకి మద్దుతుదారు. ఆమె ఈ విషయాన్ని కొన్నాళ్ల కిందట బహిరంగంగానే చెప్పారు. 2015లో ములాయం మనవడి వివాహానికి మోడీ హాజరైనప్పుడు భర్తతో కలిసి వెళ్లి ఆయనతో సెల్ఫీ దిగారు. అంతేగాక, బిజెపి కార్యక్రమాలకు కూడా ఆమె మద్దతు ఇస్తుంటారు.

డింపుల్ వర్సెస్ అపర్ణ
ఇది ఇలా ఉండగా, అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్‌ను అపర్ణాయాదవ్‌కు ప్రత్యర్థిగా పలువురు వర్ణించడం గమనార్హం. పార్టీ కార్యక్రమాల్లో బాగా కష్టపడతారన్న పేరు డింపుల్‌కు ఉంది.

సీఎం పదవే టార్గెట్?
ఎస్పీలో యువనేతగా ఎదగడమే లక్ష్యంగా అపర్ణ రాజకీయాల్లోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ స్థానాన్ని ఆమె భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ దిశగానే ఆమె పావులు కదుపుతున్నారు. కాలం కలిసి వస్తే.. అఖిలేశ్‌ను తోసిరాజనేందుకు వీలుగా అపర్ణకు అధినేత ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఆమె శివ్‌పాల్ యాదవ్ వర్గం నేతగా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications