చింతలకుంట నుంచి మహేష్ బాబు రూట్ మార్చారా?
హైదరాబాద్: శ్రీమంతుడు చిత్రం విజయంతో జోరు మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. ఏపీలో తన తండ్రి స్వగ్రామం అయిన బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు. ఇందుకోసం అర్జీ పెట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోను ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని నెల పది రోజుల క్రితం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన పాలమూరు జిల్లాలోని చింతలకుంట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు మహేష్ బాబు చెప్పారు.
అయితే, తాజాగా కొత్తూరు మండలం సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో, ఆయన తెలంగాణ రాష్ట్రంలో రెండు గ్రామాలను దత్తత తీసుకుంటున్నారా? లేక పాత గ్రామం చింతలకుంటను వదిలేసి కొత్త గ్రామాన్ని (సిద్ధాపురం)ను దత్తత తీసుకుంటున్నారా తెలియాల్సి ఉంది.

మహేష్ బాబు తాజాగా, ట్విట్టర్లో పేర్కొన్న దానిని బట్టి కేవలం సిద్ధాపురం గ్రామాన్ని మాత్రమే దత్తత తీసుకుంటున్నట్లుగా అర్థమవుతోంది.
మహేష్ బాబు ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ వేదికగా కోరారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలోని ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకొమ్మని కోరగా.. పాలమూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు మహేష్ బాబు సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన గట్టు మండలం చింతలకుంట గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారని వార్తలు వచ్చాయి. ఆ గ్రామంలో ఆయన గత నెల 29వ తేదీన పర్యటిస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే, గ్రామజ్యోతిలో భాగంగా తాజాగా, సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications