'ఆ ప్రచారం తిప్పికొట్టేందుకే జగన్ ప్రయత్నం'
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ యాత్రలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన ఘాటైన విమర్శలు చేశారు. పౌరసత్వం రద్దు చేసి ఇటలీకి వెళ్లి పొమ్మంటే సోనియా అంగీకరిస్తారా అని ధ్వజమెత్తారు. ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన సోనియానే వెళ్లకుంటే అరవై ఏళ్ల నుండి కలిసున్న తమను ఎలా విడదీస్తారని జగన్ ప్రశ్నించారు.
సోనియా తన కొడుకు, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రచారం చేసేందుకు తెలుగు ప్రజలతో ఆడుకుంటున్నారని, ఢిల్లీ కోటను బద్దలు కొడతామని తెలుగు ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగు ఆత్మగౌరవానికి మధ్య పోరాడమని నినదించారు. అయితే సోనియా పైన జగన్ ఎన్ని విమర్శలు చేసినా అవి వ్యూహాత్మకమేనని, మ్యాచ్ ఫిక్సింగ్ ప్రచారం తిప్పి కొట్టేందుకే ఘాటైన విమర్శలు సోనియా పైన చేస్తున్నారని తెలుగుదేశం విమర్శిస్తోంది.

రాష్ట్ర విభజన కోసం మొదటి నుండి ఉద్యమిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితిని, ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును విమర్శించక పోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ పార్టీ నాయకులు షర్మిల, వైయస్ విజయమ్మలు తెలంగాణలో పర్యటించినప్పుడు తెరాస పైన నిప్పులు చెరిగారు. కానీ ఇప్పుడు జగన్ మాట్లాడటక పోవడం చర్చనీయాంశమైంది.
అదే సమయంలో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడునే ఆయన టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇంకో వైపు ఈ సభకు బస్సుయాత్ర, పాదయాత్ర చేపట్టిన షర్మిల, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రాలేదు. తెలంగాణ ప్రాంత ముఖ్య నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గైర్హాజరయ్యారు. సభలో మహిళా నేత రోజాకు మాట్లాడే అవకాశం రాలేదు.












Click it and Unblock the Notifications