వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను మోనార్క్! తనిఖీలు చేస్తా, బెదరను: కెసిఆర్ తీవ్ర హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రయివేటు విద్యా సంస్థల సంఘం తీరుపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం రాత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే బోగస్ విద్యా సంస్థలను ఏరివేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు.

ప్రయివేటు విద్యాసంస్థల బెదిరింపులకు లొంగేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ విద్యా సంస్థల్లో తనిఖీలు జరిగి తీరుతాయన్నారు. రాష్ట్రంలో నిర్వహించాల్సిన టెట్‌, ఎంసెట్‌ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ విద్యాసంస్థల జేఏసీ ప్రకటించటంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ రెండు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు గురువారం రాత్రి ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 1న టెట్, మే 2న ఎంసెట్‌ జరగాల్సి ఉంది. వీటిని మే 20వ తేదీలోగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బంది పర్యవేక్షణ, సహకారంతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 KCR Fires on Telangana Private Colleges JAC

అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని సీఎం కోరారు. పరీక్షల వాయిదాతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఒకటి రెండు రోజుల్లో పరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశముంది.

రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రయివేటు విద్యా సంస్థల సంఘం నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వారి తీరును కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్యలను ప్రయివేటు విద్యాసంస్థల జేఏసీగా చెప్పుకుంటున్న వారు వ్యతిరేకించడాన్ని కేసీఆర్‌ తప్పుబట్టారు.

విజిలెన్స్‌ శాఖ ఆధ్వర్యంలో, అనేక సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటు విద్యా సంస్థలో తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. థర్డ్‌ పార్టీగా బిట్స్‌ పిలాని, ట్రిపుల్ ఐటీ లాంటి సంస్థలు కూడా తనిఖీల్లో ఉంటాయన్నారు. విద్యా సంస్థల పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోకుంటే ఎవరు తీసుకుంటారని సీఎం ప్రశ్నించారు.

విద్యాసంస్థల్లో తనిఖీలు చేయవద్దని డిమాండ్‌ చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. తనిఖీలు చేయకుంటే ఏ విద్యాసంస్థ ఎలా ఉంది? సరైన ప్రమాణాలు పాటిస్తోందా? లేదా? ఎవరైనా తప్పులు చేస్తున్నారా? అనే విషయాలు ఎలా తెలుస్తాయని ముఖ్యమంత్రి నిలదీశారు.

టెట్‌, ఎంసెట్‌ పరీక్షలను బహిష్కరించాలని ప్రయివేటు విద్యాసంస్థలు నిర్ణయించుకోవడం శోచనీయమన్నారు. విద్యా సంస్థల్లో పోలీసుల తనిఖీలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కొన్ని ప్రయివేటు విద్యాసంస్థల్లో పరిస్థితిని చూసి చలించి, స్పందించామని, విచారణ జరిపించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఆదేశించామన్నారు.

ఏం జరిగిందంటే...

విద్యా సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని, బోగస్‌ విద్యాసంస్థల భరతం పట్టేందుకు విజిలెన్స్‌ తనిఖీలు చేపడతామని ఇటీవల సీఎం విద్యాశాఖ సమీక్షలో చెప్పారు. ఆ క్రమంలో వివిధ పోలీసు విభాగాలతో తనిఖీలు చేసేందుకు ప్రభుత్వం ఈ నెల 8న సర్క్యులర్‌ జారీ చేసింది.

విద్యా సంస్థల్లో పోలీసు తనిఖీలను అంగీకరించేదిలేదంటూ అన్ని రకాల ప్రైవేటు విద్యాసంస్థలు... తెలంగాణ విద్యాసంస్థల జేఏసీగా ఏర్పడి కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నాయి. పాలిసెట్‌, పోలీసు కానిస్టేబుల్‌ పరీక్షల నిర్వహణకు సహకరించేది లేదని తొలుత జేఏసీ ప్రకటించింది.

ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డితో జరిగిన చర్చలతో పరీక్షలకు సహకరిస్తున్నట్లు ప్రకటించాయి.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం లేదనందున సహకరిస్తున్నామని తెలిపాయి. అయితే, ప్రభుత్వం తనిఖీలకే సిద్ధమవుతోందని భావించిన విద్యాసంస్థల జేఏసీ తాజాగా గురువారం సమావేశమై టెట్‌, ఎంసెట్‌ను బహిష్కరిస్తున్నామని, వాటికి పరీక్షా కేంద్రాలు, సిబ్బందిని ఇచ్చేది లేదని ప్రకటించింది. కాగా, శుక్రవారం హైకోర్టులోను దాడుల విషయంలో తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

English summary
Telangana CM KCR Fires on Telangana Private Colleges JAC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X