కెసిఆర్ ప్లాన్: కార్పోరేట్ దిగ్గజాలతో ఊపు
హైదరాబాద్: తెలంగాణలో పారిశ్రామిక రంగానికి పారిశ్రామిక దిగ్గజాల సాయంతో పటిష్టమైన ఊపు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన రతన్ టాటా, ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ, అజీం ప్రేమ్‌జీ, ఎన్ఆర్ నారాయణమూర్తి సహకారంతో పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలనే తలంపుతో ఆయన అన్నారు.
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడానికి, పారిశ్రామిక విధానాన్ని రూపొందించడానికి ఆ కార్పోరేట్ దిగ్గజాలను సంప్రదించాలని కెసిఆర్ పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. సిసిఐ, ఫిక్కీ వంటి సంస్థల సలహాలు కూడా తీసుకోవాలని సూచించారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ దేశ రాజధాని ఢిల్లీలోనూ సదస్సులు నిర్వహించి, వాటికి కార్పోరేట్ మహామహులను ఆహ్వానించి, వారి సలహాల మేరకు పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేయాలని ఇప్పటికే ఆయన అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ఆర్థిక విధానాన్ని ఓ నెల లోగా ప్రకటించాలనే సంకల్పంతో ఆయన ఉన్నారు. పరిశ్రమల శాఖను తన వద్దే ఉంచుకున్న కెసిఆర్ స్వయంగా కూడా పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నారు. గుజరాత్, తదితర రాష్టాల పారిశ్రామిక విధానాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
తెలంగాణలో అపారమైన సహజ వనరులున్నాయని, వాటిని ఉపయోగించుకుని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి వీలుగా పారిశ్రామిక విధానం ఉండాలని కెసిఆర్ భావిస్తున్నారు. తెలంగాణలో పది జిల్లాలు ఉండగా తొమ్మిది జిల్లాల్లో క్వార్ట్జ్, బెరైటీస్, మాంగనీసు, డోలమైట్ తదితర ఖనిజాలు ఉన్నాయని ఇప్పటికే ఆయన గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వనరులను వాడుకోవడానికి రిఫైనరీలను, ఉత్పత్తిర పరిశ్రమలను స్థాపించేలా పారిశ్రామిక విధానం ఉండాలని కెసిఆర్ ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications