అది వెనక్కి: కెసిఆర్ చేతికి నమస్తే తెలంగాణ
హైదరాబాద్: నమస్తే తెలంగాణ దినపత్రిక అధిపతి లక్ష్మీరాజం యూటర్న్ తీసుకున్నారు. నమస్తే తెలంగాణ దినపత్రికను తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేతిలో పెట్టడానికి అంగీకరించారు. సోమవారం కెసిఆర్ అధికారిక నివాసంలోకి ప్రవేశించిన సందర్భంగా జరిగిన పూజాకార్యక్రమానికి లక్ష్మీరాజం దంపతులు కూడా హాజరయ్యారు.
నమస్తే తెలంగాణ దినపత్రికను తొలుత కెసిఆర్ అడిగినట్లు, దానికి లక్ష్మీరాజం అంగీకరించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా లక్ష్మీరాజం ఢిల్లీ వెళ్లి బిజెపిలో చేరారు. ఆ తర్వాత తిరిగి వచ్చి నమస్తే తెలంగాణ దినపత్రిక తన చేతుల్లోనే ఉంటుందని, చేతులు మారదని ప్రకటించారు. పత్రికాముఖంగా కూడా ఆయన ఆ విషయం ప్రకటిస్తూ వచ్చారు.

లక్ష్మీరాజం వెనక్కి తగ్గిన నేపథ్యంలో కెసిఆర్ బంగారు తెలంగాణ పేర దినపత్రిక తేవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఇంతలోనే పరిస్థితి మారిపోయింది. నమస్తే తెలంగాణ పత్రికనే ఆయన చేతుల్లో పెట్టడానికి లక్ష్మీరాజం అంగీకరించారు. ఇందుకు సంబంధించి తుది నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో జరగనుంది.
మొదటి నుంచీ లక్ష్మీరాజం కెసిఆర్‌కు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. లక్ష్మీరాజానికి రాజ్యసభ సీటు ఇస్తానని కూడా కెసిఆర్ ప్రకటించారు. అయితే, పత్రిక విషయంలో ఇరువురి మధ్య విభేదాలు పొడసూపినట్లు వార్తలు వచ్చాయి. ఏమైందో గానీ, తిరిగి లక్ష్మీరాజం కెసిఆర్ చెంతకు చేరారు.
కాగా, లక్ష్మీరాజం మెట్రో ఇండియా ఆంగ్ల దినపత్రికను కూడా నడుపుతున్నారు. దాని భవిష్యత్తు ఏమిటనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications