• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎందుకిలా..: జగన్ సహా వీరంతా కేసులతో విలవిల

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ప్రత్యేకించి బీజేపీయేతర సీఎంలను వేధించేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారాలను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. అయితే, వారంతా కేసులను ఎదుర్కోవాల్సిన స్థితిలో ఎందుకు పడ్డారనేది కూడా ఆలోచించాల్సిన విషయమే.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు స్వయంగా నేషనల్ హెరాల్డ్ ఇంగ్లిష్ దిన పత్రిక మూసివేత కేసులో అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి వ్యతిరేకంగా ఎయిర్ సెల్ - మాక్సిస్ ఒప్పందంపై సీబీఐ కేసు నమోదు చేయగా, ఢిల్లీలో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కు, ఆ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోంది. మంత్రులు సత్యేంద్ర జైన్ సహా పలువురు ఆప్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయిస్తోంది.

ఇతర పార్టీల నేతలపై అవినీతి ఆరోపణలు చేసిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కట్టడి చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నది. హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ పైనా అవినీతి కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆయా పార్టీల నేతలపై సీబీఐ, ఇడి నమోదు చేసిన కేసుల వివరాలు ఒకసారి పరిశీలిద్దాం..

‘నేషనల్ హెరాల్డ్’ కేసు

‘నేషనల్ హెరాల్డ్’ కేసు

ఆంగ్ల దినపత్రిక ‘నేషనల్ హెరాల్డ్' కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నేతలు ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ వోరా, సుమన్ దూబెతోపాటు ఇటలీకి చెందిన శ్యామ్ పిట్రోడాలపై ఆరోపణలు నమోదయ్యాయి. 2012లో బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఢిల్లీలోని న్యాయస్థానంలో ప్రయివేట్ కేసు నమోదు చేశారు. ‘నేషనల్ హెరాల్డ్' ఆంగ్ల దినపత్రిక పబ్లిషర్ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఎజెఎల్) ట్రస్టును యంగ్ ఇండియన్ ప్రయివేట్ లిమిటెడ్ (యూఐపీఎల్) ద్వారా స్వాధీనం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసానికి, నమ్మకద్రోహానికి పాల్పడ్డారని సుబ్రమణ్య స్వామి తన పిటిషన్‌లో ఆరోపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని ఆరోపిస్తోంది. ప్రస్తుతం కేసు న్యాయస్థానం విచారణలో ఉంది. 2015 డిసెంబర్‌లో ఢిల్లీ న్యాయస్థానం బెయిల్ మంజూరుచేసింది. కాంగ్రెస్ పార్టీ, ఎజెఎల్ రికార్డులు సమర్పించాలని ఆదేశించాలన్న సుబ్రమణ్య స్వామి పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

 ఎయిర్ సెల్ - మాక్సిస్ కేసు

ఎయిర్ సెల్ - మాక్సిస్ కేసు

2006లో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ఎక్స్ అఫిసియో చైర్మన్ హోదాలో కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పీ చిదంబరంపై ఒక మలేషియా కంపెనీకి ప్రయివేట్ టెలికం కంపెనీ ‘ఎయిర్ సెల్' విక్రయాన్ని ఆమోదించారని అభియోగం. ఈ అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసును నమోదు చేసిందీ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యమే. రూ.600 కోట్లకు పై విలువ గల ఈ ఒప్పందం ఎయిర్‌సెల్ విక్రయ ఒప్పందానికి ఎఫ్ఐపీబీ ఎక్స్ అఫిసియో చైర్మన్ హోదాలో చిదంబరం చట్ట విరుద్ధంగా ఆమోదం తెలిపారని సుబ్రమణ్యం ఆరోపణ. కానీ చిదంబరం ఈ ఆరోపణలను తిరస్కరించారు. ఎయిర్‌సెల్ ఒప్పందానికి నిబంధనలకు అనుగుణంగానే ఆమోదం తెలిపానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసుపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది.

ఆమ్ఆద్మీ పార్టీపై ఏడు

ఆమ్ఆద్మీ పార్టీపై ఏడు

ఈ ఏడాది ఢిల్లీలోని అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)పై ప్రాథమిక విచారణలు జరిపిన సీబీఐ రెండింటిపై కేసులు నమోదుచేసింది. ఢిల్లీ సచివాలయంలో సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంపై దాడి చేయడంతో సీబీఐికి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్య ప్రతిష్ఠంభన మొదలైంది. పలు దఫాలు విచారణ తర్వాత రాజేంద్ర కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. తర్వాత బెయిల్‌పై సీనియర్ బ్యూరోక్రాట్ రాజేంద్ర కుమార్ విడుదలైన తర్వాత కూడా ఆప్ ఎమ్మెల్యేలపై కేసుల నమోదు ఆగలేదు.

ఆప్ ఎమ్మెల్యేలపై కేసులు

ఆప్ ఎమ్మెల్యేలపై కేసులు

అవినీతి ఆరోపణలపై ప్రస్తుత ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్, మాజీ ఎమ్మెల్యే అసింఖాన్‌లను అరెస్ట్ చేసింది సీబీఐ. ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వద్ద పనిచేస్తున్న ఓఎస్డీ నిఖుంజ్ అగర్వాల్ నియామకంపై మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ‘టాక్ టూ ఎకె' కార్యక్రమ నిర్వహణపై సోషల్ మీడియాలో ప్రచారం కాంట్రాక్ట్ ‘పర్ ఫెక్ట్ రిలేషన్స్' అనే సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించడానికి వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేయడం ఆమ్ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు. కానీ రాజేంద్ర కుమార్‌పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయడం పూర్తిగా రాజకీయ దురుద్దేశమని ఆప్ ఆరోపిస్తోంది.

హరీశ్ రావత్‌కు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్

హరీశ్ రావత్‌కు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్

గతేడాది ఏప్రిల్‌లో ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్‌రావత్‌పై సీబీఐ ప్రాధమిక విచారణ జరిపింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సమయంలో తనకు మద్దతు తెలుపాలని కోరుతూ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు హరీశ్ రావత్ ముడుపులు చెల్లించబోతుండగా స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయారు. గత డిసెంబర్‌లో సీబీఐ ఆయన్ను ప్రశ్నించి వదిలేసింది.

సీఎం వీరభద్రసింగ్‌పై సీబీఐ, ఈడీ కేసు

సీఎం వీరభద్రసింగ్‌పై సీబీఐ, ఈడీ కేసు

హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్, ఆయన సతీమణి ప్రతిభ తదితరులపై 2015 సెప్టెంబర్‌లో అవినీతి నిరోదక చట్టం కింద కేసు నమోదైంది. యూపీఏ మలివిడత ప్రభుత్వ హయాంలో మంత్రిగా అక్రమాస్తులకు సంబంధించిన వనరుల వివరాలు తెలియజేయాలనికోరుతూ సీబీఐ ఈ పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఇది రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన కేసని వీరభద్రసింగ్ ఆరోపించారు. గత బుధవారం తనపైన, తన భార్యపై దాఖలుచేసిన క్రిమినల్ కేసు కొట్టేయడానికి న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై సీఎం వీరభద్ర సింగ్ తదితరులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. హిమాచల్ సీఎం వీరభద్రసింగ్ కూతురు వివాహం నాడే ఆయన ఇంటిపై సీబీఐ దాడులు చేసినా ఎవరిని అరెస్ట్ చేసింది.

భూపీందర్ సింగ్ హుడాపై గుర్గావ్ భూ కేటాయింపు కేసు

భూపీందర్ సింగ్ హుడాపై గుర్గావ్ భూ కేటాయింపు కేసు

హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాపై గుర్గావ్ భూ కేటాయింపుపై 2015 సెప్టెంబర్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో గుర్గావ్‍లో 400 ఎకరాలను ప్రైవేట్ బిల్డర్లకు భూమి అప్పగించారని ఆయనపై అభియోగం. గత ఏడాది హుడా కు చెందిన 20 ప్రదేశాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. కానీ ఈ ఆరోపణలను హుడా తిరస్కరించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మాయాపై ఎన్ఆర్‌హెచ్ఎం కుంభకోణం

మాయాపై ఎన్ఆర్‌హెచ్ఎం కుంభకోణం

జాతీయ గ్రామీణ ఆరోగ్య సంస్థ (ఎన్ఆర్‌హెచ్ఎం) నిధుల వినియోగంలో అవకతవకలపై యూపీ మాజీ సీఎం - బీఎస్పీ అధినేత మాయావతిపై అభియోగాలు నమోదయ్యాయి. ఆమెతోపాటు ఆ పార్టీ నాయకులు అనంతకుమార్ మిశ్రా, బాబూసింగ్ కుశ్వాహ లపై అభియోగాలు నమోదయ్యాయి. 2005 - 11 మధ్య కేంద్రం.. ఎన్‌హెచ్ఆర్ఎం కింద రూ.10 వేల కోట్లు కేటాయించారు. రూ.4,900 కోట్ల మేరకు అవకతవకలు జరిగాయని ‘కాగ్' నిర్ధారించింది. ఈ కేసులో సీబీఐ 70కి పైగా ఎఫ్ఐఆర్ లు, 50 చార్జిషీట్లు నమోదు చేసింది.

ఫరూఖ్ అబ్దుల్లాపై క్రికెట్ సంఘం కేసు

ఫరూఖ్ అబ్దుల్లాపై క్రికెట్ సంఘం కేసు

జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాతోపాటు జమ్ము కశ్మీర్ క్రికటె్ అసోసియేషన్ కు చెందిన ఇద్దరు అధికారులు రూ.113 కోట్లు దుర్వినియోగం చేశారని సీబీఐ 2015లో కేసు నమోదు చేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కేసుపై విచారణను సీబీఐకి అప్పగించాలని జమ్ము కశ్మీర్ హైకోర్టు ఆదేశించింది. దీనిలో సీనియర్ రాజకీయ నాయకుల పాత్రపై విచారణ ప్రారంభించనే లేదు.

 సచిన్ పైలట్ తదితరులపై అంబులెన్స్ కేసు

సచిన్ పైలట్ తదితరులపై అంబులెన్స్ కేసు

రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలట్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొడుకు కార్తి, వాయలార్ తనయుడు రవి క్రుష్ణ తదితరులపై అంబులెన్స్ కొనుగోలు కేసు నమోదైంది. ప్రైవేట్ సంస్థకు టెండర్ కొనుగోళ్లకు అవినీతికి పాల్పడ్డారని అభియోగం. కానీ అభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా వాటిని తిరస్కరించారు. ముంబై కేంద్రంగా జిఖిత్జా హెల్త్ కేర్ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లపై పీఎంఎల్ఎ చట్టం కింద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కేసు నమోదుచేసింది. సంస్థ ఆస్తులను జప్తుచేసింది.

జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసు

జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి బిజినెస్ సామ్రాజ్యానికి ఆదాయ వనరులు ఎక్కడివో తెలియజేయాలని 2011 ఆగస్టు, 2012 మే 27 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు ఆదేశించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వివిధ కంపెనీలు అనుచిత లబ్ది పొంది వైఎస్ జగన్మోహనరెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయని అభియోగం. 2013 సెప్టెంబర్ 25 నుంచి సుమారు 16 నెలల పాటు అరెస్టయి చంచల్ గూడ జైలులో ఉన్నారు. కానీ ఈ ఆరోపణలను ఆయన తిరస్కరించారు. ఈ ఏడాది సీబీఐ.. రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. 16 రాష్ట్రాల్లో 110 కేంద్రాల్లో ఈడీ ‘షెల్ కంపెనీ'లపై దాడులు చేసింది.

టీఎంసీ నేతలపై శారద చిట్

టీఎంసీ నేతలపై శారద చిట్

పశ్చిమ బెంగాల్ లోని అధికార త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు శారదా చిట్ పండ్ కంపెనీలో రూ.2500 కోట్లకు పైగా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికార టీఎంసీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నాలుగో తేదీన పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ, గత ఏడాది డిసెంబర్ 30 న మరో ఎంపీ తపస్ పాల్ లను సీబీఐ అరెస్ట్ చేసింది. దర్యాప్తు కొనసాగుతున్నది.

ఛగన్ భుజ్‪బల్ పై మనీ లాండరింగ్ కేసు

ఛగన్ భుజ్‪బల్ పై మనీ లాండరింగ్ కేసు


మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టుల ఆమోదంలో అవకతవకలకు పాల్పడినట్లు ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ గత ఏడాది ఆయన్ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.

English summary
Congress has repeatedly disrupted proceedings in Rajya Sabha on Monday, accusing the Narendra Modi government of using the CBI and Enforcement Directorate (ED) against opposition leaders, especially non-BJP chief ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X