మోడీ దరిచేరని వర్షం: తడిసి ముద్దైన కేజ్రీ!
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఓ విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం భారీ వర్షం కురిసింది. అయితే తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారీ వర్షంలోనే జాతీయ జెండాను ఎగరేయాల్సివచ్చింది.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండా ఎగురవేసే ఎర్రకోట వద్ద చినుకు కూడా పడలేదు. తీవ్ర ఉక్కపోత మధ్య ప్రధాని మోడీ ప్రసంగం కొనసాగినంత సేపు వరుణుడు అటువైపు తొంగిచూడలేదు. అయితే, కార్యక్రమం ముగిసి జనమంతా వెళ్లిపోగానే అక్కడ కూడా భారీ వర్షం పడటం గమనార్హం.
ఎట్ హోంకూ వర్షం తాకిడి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఎట్‌హోం కార్యక్రమానికి భారీ వర్షం అడ్డంకిగా మారింది. రాష్ట్రపతి ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లోని చారిత్రక మొఘల్‌గార్డెన్‌లో జరగటం ఆనవాయితీ. అయితే, శనివారం ఢిల్లీలో భారీ వర్షం కురవటంతో అశోకా హాల్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్‌అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, బిజెపి నేతలు ఎల్‌కే అద్వానీ, అమిత్‌షా, కేంద్రమంత్రులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, నగర లెప్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
కేజ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ
ఇది ఇలా ఉండగా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం కేజ్రీవాల్ 47వ వసంతంలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని శుభాకాంక్షలకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications