టిపై టైం కష్టమేనా: ప్రణబ్ మనసులో ఏముంది?
తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో.. ఇంకా సమయం ఇవ్వాలని సీమాంధ్ర ప్రాంత నేతలు, త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రాంత నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కోరుతున్నారు. అయితే, జనవరి 23వ తేదీ వరకు అభిప్రాయాలు చెప్పాలని సమయం ఇచ్చిన ప్రణబ్ ఆ గడువును పొడిగించే అవకాశాలు లేవంటున్నారు. తొలి విడత అసెంబ్లీ సమావేశాల్లో సీమాంధ్ర ప్రతినిధులు బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకున్నారు.
అసెంబ్లీలో చర్చ జరిగితే సీమాంధ్రులకు ఉన్న భయాందోళనలపై సమాధానం దొరుకుతుందని, పార్లమెంటుకు బిల్లు వచ్చాక కూడా కేంద్రం అందరి అనుమానాలను తొలగిస్తుందని అంటున్నారు. ఇటీవల బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో పలువురు నేతలు వరుసగా రాష్ట్రపతిని కలుస్తున్నారు.

రెండు రోజుల క్రితం బిజెపి నేతలు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ... బిల్లుపై చర్చకు ఆరువారాలు సరిపోతుందని ప్రణబ్ అభిప్రాయపడ్డారన్నారు. చర్చ జరగకుండానే మరింత సమయం కావాలని సీమాంధ్ర నేతలు కోరడం రాష్ట్రపతిని అగౌరవపర్చడమే అన్నారు. అసెంబ్లీలో చర్చ జరిగితే సమస్యల పైన చర్చించేందుకు ప్రతి సభ్యుడికి అవకాశం దొరుకుతుందన్నారు.
మరోవైపు, రానున్న పార్లమెంటు ఎన్నికలలోపు విభజన ప్రక్రియ పూర్తి కావడం సందేహమేనన్న అభిప్రాయంలో రాష్ట్రపతి ఉన్నారనే వారు కూడా లేకపోలేదు. గురువారం తనను కలిసిన కొందరు నాయకుల వద్ద ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారట. పలువురు నేతలతో భేటీ అయినప్పుడు... వచ్చే పార్లమెంటు ఎన్నికలలోపు విభజన ప్రక్రియ పూర్తవుతుందా అన్న అంశం చర్చకు రాగా అంత టైమెక్కడుందన్న అభిప్రాయాన్ని ప్రణబ్ వ్యక్తం చేశారట.
విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీ తన అభిప్రాయం చెప్పడానికి జనవరి 23 వరకూ ఆయన సమయమిచ్చారు. అసెంబ్లీ అభిప్రాయాలు క్రోడీకరించడానికి మరో మూడు రోజులు సమయమిచ్చారు. అవి ఢిల్లీ వెళ్లిన తర్వాత వాటిపై కేంద్ర హోం శాఖ సంబంధిత అన్ని శాఖలకు ఆ సమాచారం పంపి వాటి అభిప్రాయాలు తెలుసుకోవాలి. అవి వచ్చిన తర్వాత వాటినన్నింటినీ క్రోడీకరించి కేబినెట్ నోట్ తయారు చేయాలి. దానిని మంత్రివర్గం ముందు పెట్టి ఆమోదం తీసుకొని రాష్ట్రపతికి పంపాలి.
ఆయన ఆమోదం వచ్చిన తర్వాత పార్లమెంటు ముందుకు పంపాలి. అన్నీ సవ్యంగా పూర్తయితే ఫిబ్రవరి రెండోవారంలో జరిగే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో విభజన బిల్లు పార్లమెంటు ముందుకు రావాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15వ తేదీకి అటూ ఇటూగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని అంచనా. ఈ లోపు బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించాల్సి ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో ఇవన్నీ పూర్తి కావడం సాధ్యమేనా అన్న అభిప్రాయంలో రాష్ట్రపతి ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాగా, విభజనకు సంబంధించి తనను కలిసిన అనుకూల, వ్యతిరేక వర్గాల వారి వద్ద తన మనోగతమేదీ బయటపడకుండా రాష్ట్రపతి ఆచితూచి వ్యవహరించినట్లుగా కనిపిస్తోందంటున్నారు. వారు చెప్పిన వాటిని శ్రద్ధగా ఆలకించడం తప్ప వాటిపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని సంకేతప్రాయంగా కూడా వెల్లడించలేదంటుననారు. రెండు పక్కలా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే ఆయన ఇలా పరిణితితో వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications