మెగా మార్పు:అది.. పవన్‌పై ఫ్యాన్స్ మనసులో మాట
హైదరాబాద్: మెగా అభిమానులు మారుతున్నారు! మొన్నటి దాకా తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న ఫ్యాన్స్... ఇప్పుడు క్రమంగా జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైపు మళ్లుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇందుకు పలు నిదర్శనాలు కనిపిస్తున్నాయి. పవన్ జనసేన పార్టీ పెట్టాక.. చాలామంది అభిమానులు పవర్ స్టార్ వైపు మొగ్గు చూపారు. అదేమని అడిగితే... సినిమాల్లో మెగా కుటుంబం అంతా ఒక్కటేనని, రాజకీయం వేరని చెప్పారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం చాలా ఉపయోగపడిందని ఎవరూ కొట్టిపారేయలేని అంశం.
ఇప్పుడు మెగా అభిమానులు చాలామంది పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటున్నారు. విప్లవ సినిమాల నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణ మూర్తి మంగళవారం చేసిన వ్యాఖ్యలతో అభిమానుల్లో మరింత ఆ ఉత్సాహం కనిపిస్తోందని చెబుతున్నారు.

మంగళవారం రేయ్ సినిమా ఆడియో ఫంక్షన్ సమయంలో నారాయణ మూర్తి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మీరు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో కొత్త ఆశలు రేపాయని చెప్పవచ్చు. నిన్నటి వరకు అభిమానుల మనసుల్లో ఉన్న దానిని నారాయణ మూర్తి బయటకు చెప్పారనొచ్చు.
గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలని అభిమానులు కోరుకున్నారు. 2009 ఎన్నికల్లో ఓట్ షేర్ ఆశించినట్లుగా వచ్చినా సీట్లు మాత్రం 18 మాత్రమే వచ్చాయి. 2014లోనైనా చిరు ముఖ్యమంత్రి అవుతారని అభిమానులు ఆశించారు.
కానీ ఆ తర్వాత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. చిరు తన పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారనే అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి! అయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్.. టీడీపీ - బీజేపీ కూటమికి మద్దతిచ్చారు.
అయితే, మెగా అభిమానుల ముఖ్యమంత్రి ఆశలు మాత్రం అలాగే ఉన్నాయని చెప్పవచ్చు. జనసేన పార్టీ స్థాపించిన పవన్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి అభిమానుల మనసులోని మాటను బయటపెట్టారని అంటున్నారు.












Click it and Unblock the Notifications