రూ.90 కోట్లు, 100 కిలోల గోల్డ్: శశికళకు దగ్గర ఎవరీ శేఖర్ రెడ్డి?
టిటిడి బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి వద్ద 90 కోట్ల రూపాయల నగదు, 100 కిలోల బంగారం పట్టుబడింది.
హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు తర్వాత తమిళనాడులోనే అత్యంత ఎక్కువ మొత్తం ధనం, బంగారం బయటపడిన సంఘటన జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి సభ్యుడు శేఖర్ రెడ్డి నుంచి 90 కోట్ల రూపాయల నగదు, వంద కిలోల బంగారం ఐటి అధికారులకు చిక్కాయి.
శేఖర్ రెడ్డిది తమిళనాడులోని వేలూరు జిల్లా కట్పాడి సమీపంలోని తొండ్ర తులసి అనే గ్రామం. ఆయన మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. తొలుత చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునేవారని చెబుతారు. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు.
క్రమంగా స్థానిక రాజకీయ నాయకులకు దగ్గరయ్యారు. దాంతో పాటు తమిళనాడు ప్రభుత్వంలో పని చేసే కొంతమంది సీనియర్ ఐఏఎస్‌లకు సన్నిహితుడిగా మారారు. రోడ్లు, నిర్మాణ కాంట్రాక్టు పనులు కూడా చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, 2001లో ప్రజా పనుల శాఖమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వానికి కూడా దగ్గరయ్యారు. అప్పటి నుంచే శేఖర్ రెడ్డి జాతకమే మారినట్లు చెబుతారు.

వైభవ్ ఇనఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, జేఎ్‌సఆర్ బిల్డర్స్ పేరిట రెండు కంపెనీలకు శేఖర్ రెడ్డి అధినేతగా ఉన్నారు. పెద్ద యెత్తున ఇసుక ర్యాంప్‌లుకూడా ఉన్నాయి. తమిళనాడు అంతటా ఇసుక తవ్వకాల అనుమతులన్నీ ఆయనకే దక్కాయని అంటారు.
ప్రస్తుతం ఈసీఆర్ రోడ్డు విస్తరణ, వీరాణాం చెరువు పూడికతీత పనులతోపాటు రూ.వెయ్యికోట్లకు పైగా విలువ చేసే కాంట్రాక్టు పనులు చేతిలో ఉన్నాయి. శశికళకు, తమిళనాడు మంత్రి విజయ భాస్కర్‌కు కూడా శేఖర్‌రెడ్డి సన్నిహితుడే. డీఎంకేలోనూ పలువురు ప్రముఖులతో బాగా పరిచయమని చెబుతారు. చిత్తూరులోని దుర్గా కాలనీలో శేఖర్ రెడ్డి అత్తగారి ఇల్లు ఉన్నట్లు సమాచారం.
జయలలిత ప్రియసిఖ శశికళతోనూ శేఖర్ రెడ్డికి మంచి పరిచయాలున్నాయి. జయ బెంగళూరు జైల్లో ఉన్న సమయంలో పన్నీర్‌సెల్వం సిఫారసుతోనే ఆయనకు టీటీడీ పాలకమండలిలో స్థానం దక్కినట్లు చెబుతారు. ఇటీవల పన్నీర్‌సెల్వం తిరుమల సందర్శించినప్పుడు శేఖర్ రెడ్డి ఆయన వెంటే ఉన్నారు. వ్యక్తిగతంగా శేఖర్ రెడ్డికి మంచి పేరే ఉంది. స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీగా విరాళాలు ఇస్తుంటారు. డబ్బుల్లేక చదువుకోలేని విద్యార్థులకు సహాయం చేస్తుంటారు.
శేఖర్ రెడ్డితోపాటు తమిళనాడు సీనియర్ మంత్రి ఎడప్పాడి పళనిస్వామి వియ్యంకుడైన ఈరోడ్డు రామలింగం నివాసంలోనూ ఐటీ అధికారులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల బెంగళూరులో పట్టుబడిన రూ.150 కోట్ల కేసుతో రామలింగానికి సంబంధం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన నివాసం నుంచి ఇటీవల సీబీఐ అధికారులు రూ.6 కోట్ల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
గురువారం రామలింగం కుమారుడైన చంద్రకాంత్‌ను వారు ప్రశ్నించారు. అదే సమయంలో శేఖర్ రెడ్డి బృందం నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి ఇద్దరూ సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అయితే పన్నీర్ సెల్వమే గెలిచారు. ఆ క్రమంలోనే శేఖర్ రెడ్డి విషయం ఐటి శాఖకు సమాచారం అందిందా అనే విషయంపై చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications