రాజధాని పేరిట కొత్త దందా: తమ్ముళ్ల వసూళ్లు..!
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ ద్వారా ఇటుకల కొనుగోలు పేరుతో తమ వంతు సాయం చేస్తున్నారు. అయితే రాజధాని నిర్మాణం కోసం ఆఫ్‌లైన్‌లో ఇటుకల కొనుగోలు పేరుతో తెలుగు తమ్ముళ్లు వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని డివిజన్ల పరిధిలో వివిధ వర్గాలు, సంస్ధలు, వ్యాపారులు, కాలనీ ఆసోసియేషన్‌కు చెందిన ప్రజలు ఇళ్లకు తిరుగుతూ ఈ వసూళ్లు చేపడుతున్నారని తెలిసింది. అయితే ఈ వసూళ్లపై రాష్ట్ర వ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమంగా ఈ వసూళ్లకు ఎవరు పిలుపునిచ్చిందీ ఎవరికీ తెలియడం లేదంటున్నారు. టీడీపీ నేతలు ఎవరైనా ఈ వసూళ్లు చేపట్టాలని పిలుపునిచ్చారా లేక టీడీపీ కార్యకర్తలే తమకు తాము సొంతంగా ఈ వసూళ్లకు పాల్పడుతున్నారా? అనే అనుమానాలకు తావిస్తోంది.

తొలుత విజయవాడలోని కొన్ని డివిజన్లకే పరిమితమైన ఈ వసూళ్లు తాజాగా గుంటూరు పట్టణానికి కూడా పాకాయి. కొంత మంది టీడీపీ కార్యకర్తలు ఎవరికీ వారు సమూహంగా ఏర్పడటం, రాజధాని అమరావతి పేరుతో విరాళాల పేరిట వసూలు చేస్తున్నారు.
ఈ విరాళాలు వసూలు చేసిన తర్వాత వారికి ఏదో ఒక పిచ్చి రశీదు ఇస్తున్నారు. ఇలా వసూలు చేసిన డబ్బును పోగు చేసి ఏం చేస్తున్నారనే దానిపై కూడా విరాళాలు ఇచ్చిన వారికి అంతుచిక్కడం లేదు. రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఇటుకలు కొనుగోలు చేసేందుకు వెబ్‌సైట్‌ను రూపొందించింది.
ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఎవరి స్థోమతను బట్టి వారు ఇటుకలను కొనుగోలు చేసి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావచ్చు. అంతేకాదు ఇలా కొనుగోలు చేస్తే ప్రభుత్వం కూడా ఒక సర్టిఫికెట్ ఇస్తుంది. అయితే ఇప్పుడు దీనికి విరుద్ధంగా వసూళ్ల పేరిట రాజధాని ప్రాంతంలో డబ్బులు వసూలు చేయడం అనుమానాలకు తావిస్తోంది.
ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఈ విధమైన వసూళ్లకు పాల్పడుతున్న తెలుగు తమ్ముళ్లపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయం. అంతేకాదు ఇలా వసూలు చేసిన విరాళాలతో ఆన్‌లైన్‌లో ఇటుకలు కొన్నారా? లేదా? అన్నది విరాళాలు ఇచ్చిన వారికి తెలియటం లేదు.












Click it and Unblock the Notifications