ఆనవాళ్లు కూడా లేవు: అదితి మిస్టరీ ఏమిటి?
హైదరాబాద్: విశాఖపట్నం డ్రైనేజీలో పడిపోయిన ఆరేళ్ల బాలిక అదితి సంఘటన ఇంకా మిస్టరీగానే ఉంది. వారం రోజులుగా జల్లెడ పడుతున్నా, మురికి కాలువలన్నీ గాలించినా ఆమె జాడ కనిపించడం లేదు. కనీసం ఆమెకు సంబంధించిన ఒక్క ఆనవాళ్లు కూడా లభించలేదు.
సముద్రంలో చాలా దూరం కూడా చూశారు. అయితే ఫలితం కనిపించడం లేదు. దీంతో అదితి సంఘటనపై అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగానే అదితి డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. విశాఖపట్నంమ నగరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓ ప్రైవేట్ బిల్డింగ్‌లో ట్యూషన్ కోసం అదితి వెళ్లింది. ట్యూషన్ ముగించుకుని బయటకు వచ్చింది.

అయితే కారులో ఉండాల్సిన డ్రైవర్ స్వీట్ షాపు దగ్గర ఉన్నాడు. అక్కడ స్వీట్లు కొనుగోలు చేస్తున్నాడు. దీంతో అదితి కూడా అక్కడకు వెళ్లింది. అక్కడకు వెళ్లే క్రమంలోనే బ్యాలెన్స్ తప్పి పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయంది. అప్పటికే వర్షం కురిసి కాల్వ వేగంగా ప్రవహిస్తూ ఉండటంతో చిన్నారి అదితి కొట్టుకు పోయింది. ఇవీ కారు డ్రైవర్, ప్రత్యక్ష సాక్షులు ఒకరిద్దరు చెబుతున్న మాటలు.
డ్రైనేజ్ కాలువలో ఒక చిన్నారి జాడ కనిపించుకండా కొట్టుకు పోయేంత వేగంగా నీరు ప్రవహిస్తోందా, పాప కొట్టుకుపోతుంటే డ్రైవర్, చుట్టూ ఉన్న వారు ఏం చేస్తున్నట్లు? కనీసం కాలువ వెంబడి పరిగెత్తే ప్రయత్నాలైనా చేశారా? చేయకపోతే ఎందుకు చేయలేదు? అనే ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
ఒక వేళ అదితి మురుగు కాలువలో పడి కొట్టుకుపోయి ఉంటే ఎంత దూరం కొట్టుకుపోగలగుతుంది. ఎక్కడా చిక్కుకోకుండా సీదాగా కొట్టుకపోయేంత విధంగా విశాఖ మురుగు కాలువలు ఉన్నాయా అనేది మరో ప్రశ్న. అంతే కాదు, ఆమె పుస్తకాలు, చెప్పులు, బ్యాగు ఏదోక ఆనవాళ్ళు లభించాలి కదా? వారానికిపైగా గాలించినా చిన్న పాటి ఆనవాలు కూడా దొరకలేదు. రోజులు గడిచే కొద్దీ అదితి మిస్సింగ్‌లో కొత్త కోణాలు, సరికొత్త అనుమానాలు బలపడుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications