పాతబాస్ బాబు, కొత్తబాస్ కెసిఆర్ భేటీ: తలసాని హ్యాపీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు కలుసుకోవడంపై పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో మాజీ టీడిపి నేత, ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడం చాలా శుభ సందర్భం అని వ్యాఖ్యానించారు. ఇరువురు కూడా మనస్పర్థలను పక్కన పెట్టి ఒకరికొకరు సహకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ గత ఏడాది వరకు తెలుగుదేశం పార్టీలో కీలక నేత. 2014 సార్వత్రిక ఎన్నికల్లోను ఆయన టిడిపి తరపున సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కొద్ది నెలల క్రితం వరకు ఆయన టిడిపిలో కీలక నేత. గ్రేటర్ టిడిపి అధ్యక్షులు. ఆ తర్వాత టిఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవి పొందారు.
మరోవైపు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూడా ఇద్దరు సీఎంల కలయిక పైన స్పందించారు. ఇరువురు సీఎంలు కలవడం శుభపరిణామం అన్నారు. ఇరువురు ముఖ్యమంత్రులు కూడా అభివృద్ధిలో పోటీ పడాలని బండారు దత్తాత్రేయ సూచించారు.
కాగా, ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వాన పత్రికను అందించారు. ఇరువురు సీఎంలు దాదాపు గంట పాటు మాట్లాడుకున్నారు. ఇరవై నిమిషాల పాటు ఇద్దరు సీఎంలు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.












Click it and Unblock the Notifications