ఎమ్మెల్యేల్లో చంద్రబాబు కాల్ టెన్షన్: భోజనానికి పిలిస్తే అంతే...
అమరావతి: తెలుగుదేశం పార్టీ శానససభ్యుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కాల్ టెన్షన్ మొదలైందని ప్రచారం సాగుతోంది. చంద్రబాబు డిన్నర్‌కు పిలిచానా, లంచ్‌కు తమ పని ఖతమని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడున్నరేళ్లకు చంద్రబాబు పార్టీ తీరును సమీక్షించడానికి సిద్ధపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఆయన ఇప్పటికే పలు సర్వేలు చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ తరఫున చేయించిన సర్వే ఫలితాలను, నిఘా వర్గాలు, ఇతర సంస్థలు చేసిన సర్వే ఫలితాలను ఆయన తెప్పించుకున్నట్లు చెబుతున్నారు.

సర్వేలను వడిపోసి ఇలా...
సర్వే ఫలితాలను అన్నింటినీ చంద్రబాబు వడబోసి, పనితీరు సరిగా లేని శాసనసభ్యుల జాబితాను కూడా తయారు చేసినట్లు చెబుతున్నారు. అంటే, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల జాబితాను ఆయన రూపొందించుకున్నారని చెప్పవచ్చు. నలబై మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన గ్రహించినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

చాలా సార్లు వారికి చెప్పారు...
నలబై మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదనే విషయాన్ని చంద్రబాబు పార్టీ సమన్వయ కమిటీ సమావేశాల్లోనూ వర్కుషాపుల్లోనూ, ఇతర వేదికలపైనా చెబుతూ వస్తున్నారు పనితీరు మెరుగు చేసుకుని, ప్రజల్లో సానుకూల వాతావరణాన్ని కల్పించుకోవాలని వారికి సూచిస్తూ వచ్చారు. వ్యవహార శైలి మార్చుకున్నవారికి తిరిగి పోటీ చేసే అవకాశం ఉంటుందని కూడా చెబుతూ వస్తున్నారు.

చంద్రబాబు బాంబు పేల్చారు...
కొంత మంది శాసనసభ్యుల్లో ఏ విధమైన మార్పు రాలేదని చంద్రబాబు గ్రహించినట్లు చెబుతున్నారు. కేవలం పది మది ఎమ్మెల్యేల్లో, నియోజకవర్గాల ఇంచార్జీల్లో మార్పు కనిపించిందని ఆయన అంచనాకు వచ్చారట. దాంతో ఆయన పార్టీ బాధ్యుల సమావేశంలో బాంబు పేల్చారంటూ వార్తలు వచ్చాయి. పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలను, ఇంచార్జీలను ఇంటికి పిలిపించుకుందామని ఆయన చెప్పారట. దంతో పార్టీ శాసనసభ్యుల్లో ఆందోళన ప్రారంభమైనట్లు చెబుతున్నారు.

గతంలో చంద్రబాబు ఇలా చెప్పారు..
ఇంటికి పిలిపించుకుందామని చంద్రబాబు అంటే పార్టీ బాధ్యులు అర్థం కాక ఎందుకు అని అడిగారట. దానికి చంద్రబాబు ఇలా చెప్పారట - "ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేశారు. ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు. అందుకే మర్యాదగా పిలిచి మంచి భోజనం పెట్టి కటుంబ సభ్యులతో మాట్లాడి వారిని సాగనంపుదాం". ఆ మాటల్లోని అంతరార్థం అప్పుడు అందరికీ అర్థమైందంటున్నారు.

ఇంటికి పిలిచి మర్యాదగా...
ఇక పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలను ఇంటికి ఆహ్వానించడానికి చంద్రబాబు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇంటికి పిలిచి కుటుంబ సభ్యులతో సహా ఫొటో దిగి, భోజనాలు, లాంఛనాలు పూర్తయిన తర్వాత అసలు విషయం చెబుతారట. టికెట్ ఇందుకు ఇవ్వలేకపోతున్నామో చెప్పి పార్టీ కోసం పనిచేయాలని, నియోజకవర్గం బాధ్యతలు వేరే నాయకుడికి అప్పగిస్తామని చంద్రబాబు చెబుతారని అంటున్నరు. దాంతో చంద్రబాబు నుంచి ఎప్పుడు కాల్ వస్తుందోననే భయం పార్టీ శాసనసభ్యుల్లో ప్రారంభమైనట్లు చెబుతున్నారు.

భయానికి కారణం ఇదీ..
ఇక ప్రతి రోజూ సాయంత్రం ఇంటి వద్ద చంద్రబాబు పార్టీ పనితీరును సమీక్షించాలని నిర్ణయించుకున్నారు మధ్యాహ్నం వరకు సచివాలయంలో ఉండి, ఆ తర్వాత నాలుగు గంటల నుంచి పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారిస్తానని చంద్రబాబు చెప్పారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో పార్టీ వ్యవహారాలను చూస్తానని ఆయన చెప్పారు ప్రతి రోజూ ఒక్కో నియోజకవర్గంపై దృష్టి సారించి ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు బాగాలేదో ఆ ఎమ్మెల్యేను భోజనానికి పిలువాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications