అక్రమణలపై కొరడా: నాగార్జున ఎన్ కన్వెన్షన్ టార్గెట్
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో భూముల అక్రమ ఆక్రమణపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే గురుకుల్ ట్రస్ట్ భూములపై చర్యలు తీసుకున్న అధికారులు తాజాగా ల్యాంకో హిల్స్, సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్‌లపై దృష్టి సారించారు. హైటెక్ సిటీ సమీపంలోని 'ఎన్' కన్వెన్షన్‌కు నోటీసు జారీ చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని అతిక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇది గతంలోనే వివాదం కావడంతో నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఉండటంతో అధికారులు ఇంత కాలం ఎన్-కన్వెన్షన్ జోలికి వెళ్లలేదు. తాజాగా దీనిపైనా అధికారులు దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా శుక్రవారం తమ్మిడికుంట పరిసరాలను పరిశీలించారు.

సర్వే అనంతరం తదుపరి నివేదికను ప్రభుత్వానికి పంపుతామని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్-కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించి మార్కింగ్ జరుగుతోందని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిన పక్షంలో చర్యలు తీసుకుంటామని కమిషనర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన అనంతరం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు.
అనధికారికంగా నిర్మాణాలు జరుపుకొని, ఇప్పటికే విద్యుత్తు, మంచినీరు వంటి సౌకర్యాలను వాడుకుంటున్న వారినుంచి మూడు రెట్లు అదనంగా రుసుము వసూలు చేస్తామని, చెరువు భూములను కబ్జా చేసిన కొందరు పెద్దలు భవంతులు నిర్మించుకున్నట్లు త వద్ద సమాచారం ఉందని, వారు ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అనధికారికంగా జరుగుతున్న నిర్మాణాలను కూల్చివేస్తామని, నిర్మాణాలు పూర్తైన వాటి విషయం తర్వాత చూస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications