ఉత్తరాఖండ్ ఎఫెక్ట్: కెసిఆర్, చంద్రబాబు ప్లాన్స్ రివర్స్?
హైదరాబాద్: ఫిరాయింపులను ప్రోత్సహించి గుండగుత్తగా రాజ్యసభ సీట్లను కైవసం చేసుకోవాలనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడు వ్యూహాలు బెడిసి కొడుతాయా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఉత్తరాఖండ్ పరిణామాలను పరిశీలిస్తే అలాగే అనిపిస్తోంది.
ఉత్తరాఖండ్‌లో పార్టీ ఫిరాయించిన ఏడుగురు కాంగ్రెస్ శాసనసభ్యులను ఓటింగ్‌కు దూరంగా ఉంచాలంటూ సుప్రింకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇరు రాష్ట్రాల ఫిరాయింపు రాజకీయాలు మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా కెసిఆర్ తెలంగాణలో కాంగ్రెసు, టిడిపి శాసనసభ్యులను తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేర్చుకుంటుండగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను చంద్రబాబు టిడిపిలో చేర్చుకుంటున్నారు.
15 మంది ఎంఎల్ఏలను గెలుచుకున్న టిడిపి కెసిఆర్ ఫిరాయింపుల ప్రోత్సాహంతో ప్రస్తుత బలం మూడుకు పడిపోయింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యులను, ఎంపిని కూడా కెసిఆర్ టిఆర్ఎస్‌లో కలిపేసుకున్నారు. కాంగ్రెస్ నుండి కూడా నలుగురు ఎంఎల్ఏలు అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

తెలంగాణాలో టిఆర్ఎస్ తమ పట్ల వ్యవహరించిన విధంగానే ఏపిలో వైసీపీ పట్ల అధికార టిడిపి వ్యవహరిస్తోంది. జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని దెబ్బ తీసేందుకు వ్యూహాలను రచిస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. 67 మంది ఎంఎల్ఏలున్న వైసీపి ప్రస్తుత బలం ఫిరాయింపుల వల్ల 51కి పడిపోయింది. రేపో మాపో మరో ఇద్దరు శాసనసభ్యులు టిడిపిలో చేరనున్నట్లు వార్తలు ప్రచారంలో ఉంది. జూన్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి దక్కుతుందనుకుంటున్న ఒక్క స్ధానాన్ని కూడా దక్కనీయకుండా చేయాలనేది చంద్రబాబు వ్యూహంగా కనబడుతోంది.
రెండు రాష్ట్రాల్లోనూ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆయా రాష్ట్రాల్లోని శాసనసభ స్పీకర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం కనిపించలేదు. స్పీకర్లు కూడా అధికార పార్టీలకు చెందిన సభ్యులే కావటంతో ప్రతిపక్షాలు చేస్తున్న ఫిర్యాదులను పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. దాంతో తెలంగాణాలో టిడిపి న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. అయితే, ఇంత వరకూ న్యాయస్ధానం నుంచి టిడిపి ఆశించిన మద్దతు లభించలేదు.
ఈ నేపధ్యంలోనే ఉత్తరాఖండ్‌లో తాజాగా ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో న్యాయస్ధానం ఇచ్చిన తీర్పు ఒక విధంగా తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో గోవాలో కూడా ఇదే తరహాలో ఏడుగురు శాసనసభ్యులను అక్కడి న్యాయస్ధానం ఫిరాయించినందుకు వారిపై అనర్హత వేటు వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కెసిఆర్, చంద్రబాబు వ్యూహాలు ఏ మేరకు ఫలితాలిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications