ముద్రగడ ఆందోళనకు మద్దతు: జగన్ అంతర్మథనం
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు గర్జనకు పార్టీ పరంగా బహిరంగ మద్దతు ప్రకటించిన వైనంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. ఈ కాపు గర్జన సందర్బంగా చోటు చేసుకొన్న సంఘటనలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సహా మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు దండెత్తడంతో ఇరకాటంలో పడినట్లు చెబుతున్నారు.
కాపు గర్జనకు పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పలువరు బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకటనతోనే వైసిపిలోని బిసి నేతలు రుసరుసలాడినా కాపు గర్జన సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలు తమకు ఎదురు తిరిగినట్లు వైయస్సార్ కాంగ్రెసు నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఈ ఉద్రిక్తతలను తెరవెనకనుంచి నడిపించిందని తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రచారంలోకి తెచ్చింది. కాపుగర్జనను ఎక్కడా తప్పుపట్టకుండా టిడిపి నేతలు వ్యూహాత్మకంగానే ఉద్రిక్తతలపై తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు భావిస్తున్నారు. కాపు గర్జనకు మద్దతు కంటే ఇప్పుడు ఆ సందర్భంగా చోటు చేసుకొన్న ఉద్రిక్తతల అపవాదు తమ మెడకు చుట్టుకుందనే ఆందోళన మొదలైందని అంటున్నారు.
కాపు గర్జన ద్వారా రాజకీయంగా లాభపడుతామని భావించినప్పటికీ అపవాదు కారణంగా మరింత నష్టపోతామేమో అనే సందేహం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవు తోంది. ఇది సమయంలో కాపు రిజర్వేషన్లకు మద్దతు తెలియజేయడం వల్ల బీసీలు దూరమవుతారా అనే ఆందోళన కూడా వైసిపిని పట్టుకుంది.
టిడిపికి కంచుకోటగా ఉన్నది బిసిలేనని, కాపు రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తే దానిపై సమాధానం చెప్పుకోలేక తెలుగుదేశం పార్టీయే చిక్కుల్లో పడి ఉండేదని అంటున్నారు. అయితే, విషయం పక్క దారి పట్టి తుని సంఘటనలు ప్రధానంగా ఎజెండా మీదికి వచ్చాయి. దీంతో తమకు లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని వైసిపి నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications