తిరుమల నుండి ఏడో మైలుకు టీటీడీ ఉచిత రవాణా: ఆ ఒక్కరోజే
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ యధాతథంగా కొనసాగుతోంది. శనివారం నాడు 59,186 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,244 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.06 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 నుండి 26 గంటల సమయం పట్టింది.
కాగా- ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు ఈ ఏడాది మే 12న టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా పూర్తవుతున్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, నడకమార్గంలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.

తిరుమల జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. హనుమాన్ జయంతి సందర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ తరపున శ్రీ జపాలి హనుమాన్ కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది.
ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు, స్థానికుల సౌకర్యార్థం తిరుమల నుండి ఏడో మైలుకు, తిరిగి తిరుమల చేరడానికి టీటీడీ ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. హనుమజ్జయంతి నాడు తిరుమలను దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా ఉండొచ్చని టీటీడీ భావిస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా..
తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. సాయంత్రం 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేకాకుండా జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని విశ్వాసం.












Click it and Unblock the Notifications