రుతుపవనాలు వచ్చేసాయ్, మొదలైన వర్షాలు- మనకు ఈ తేదీల్లో..!!
ఎండల వేళ చల్లని కబురు. అంచనా వేసినట్లే రుతుపవనాలు వచ్చేసాయి. ఈ రోజు అండమాన్ ప్రాంతంలో రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 26న కేరళ లో ప్రవేశించనున్నాయి. ఆ తరువాత ఏపీ మీదుగా తెలంగాణ వరకు విస్తరిస్తాయి. గత ఏడాది కంటే ముందస్తుగానే ఈ సారి రుతుపవనాలు ప్రవేశించటంతో... వర్షాల పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల రాక పైన అధికారులు స్పష్టత ఇస్తున్నారు.
వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులకు రుతు పవనాలు విస్తరించాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఋతుపవనాలు ప్రవేశించాయి. మరో మూడు నాలుగు రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ ప్రకటించింది. మే 26న కేరళను రుతుపవనాలు తాకే అవకాశం ఉందని వెల్లడించారు. సాధారణంగా భారత వాతావరణ అంచనా ప్రకారం ప్రతిఏటా జూన్ 1 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి ఉత్తరాదిశగా కదులుతూ విస్తరిస్తాయి. దేశంలోనే మిగతా ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తాయి.కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన నాటి నుంచి రుతుపవనాలు విస్తరించినచోట వర్షాలు మొదలవుతాయి.

జూన్ తొలి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి
అయితే, ఈ సారి అంచనాలకు అనుగుణంగానే రుతుపవనాల కదలికలు ఉన్నాయి. దీంతో, మే 26 నాటికి కేరళ లోకి ప్రవేవిస్తే.. ఇక వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేరళ నుంచి ఏపీలోని రాయలసీమకు విస్తరిస్తాయి. ఆ తర్వాత రాష్ట్రమంతా అలాగే.. తెలంగాణ కు విస్తరించి వర్షాలు మొదలవుతాయి. వాతావరణంలో అనుకూల పరిస్థితులకు తోడు అరేబియా మహాసముద్రంలో అల్పపీడన వ్యవస్థ కూడా రుతుపవనాలు త్వరగా రావటానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. అండమాన్ తీరంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశంతో.. మరికొద్ది రోజుల్లోనే వర్షాల సీజన్ భారత్ లో మొదలైనట్టే. ప్రస్తుత అంచనాల మేరకు జూన్ 6వ తేదీ తరువాత తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications