ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైలు పొడిగింపు- హాల్ట్ స్టేషన్లు
వేసవి ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. ఇందులో భాగంగా రెండు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను పొడిగించారు. నేటి నుంచే ఈ పొడిగింపు అమలులోకి రానుంది. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నిజానికి- ఆయా ప్రత్యేక రైళ్ల సర్వీసులు.. ఏప్రిల్ 30వ తేదీ నాటికి ముగియాల్సి ఉంది. వేసవిలో నెలకొన్న రద్దీ నేపథ్యంలో మరో నెల రోజుల పాటు పొడిగించారు. ఈ నెల చివరి వరకూ అవి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
దానాపూర్- బెంగళూరు..
బీహార్ లోని దానాపూర్ నుంచి సర్ ఎం విశ్వేశ్వరాయ టెర్మినస్ బెంగళూరు, హైదరాబాద్- గోరఖ్ పూర్ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇందులో ఉన్నాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటలకు దానాపూర్ నుంచి బయలుదేరే నంబర్ 03251 ప్రత్యేక రైలు రెండో రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరు స్టేషన్ కు చేరుకుంటుంది.

ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరు నుంచి బయలుదేరే నంబర్ 03252 ప్రత్యేక రైలు రెండో రోజు రాత్రి 11:55 నిమిషాలకు దానాపూర్ కు చేరుకుంటుంది. దానాపూర్ నుంచి ఈ నెల 31, బెంగళూరు నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది.
ఆరా, బక్సర్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, ప్రయాగ్ రాజ్, మాణిక్ పూర్, సత్నా, జబల్ పూర్, ఇటార్సీ, నాగ్ పూర్, సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, వరంగల్, విజయవాడ, ఒంగోలు, గూడూరు, పెరంబూర్, కాట్పాడి, జోలార్ పేట, బంగార్ పేట, వైట్ ఫీల్డ్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
హైదరాబాద్- గోరఖ్ పూర్..
నేటి నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నాంపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07075 ప్రత్యేక రైలు రెండో రోజు తెల్లవారు జామున 6:30 గంటలకు గోరఖ్ పూర్ కు చేరుకుంటుంది.
ఈ నెల 3 నుంచి ప్రతి ఆదివారం ఉదయం 8: 30 గంటలకు గోరఖ్ పూర్ నుంచి బయలుదేరే నంబర్ 07076 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయత్రం 5:25 నిమిషాలకు హైదరాబాద్ నాంపల్లికి చేరుకుంటుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.
గోండా, బారాబాంకీ, గోమతీనగర్, లక్నో సిటీ, ఐష్ బాగ్, కాన్పూర్ సెంట్రల్, పొఖ్రాయన్, ఔరాయ్, ఝాన్సీ, బీణా, భోపాల్, ఇటార్సీ, బేతుల్, నాగ్ పూర్, చంద్రాపూర్, బల్లార్షా, మంచిర్యాల, పెద్దపల్లి, ఖాజీపేట్, సికింద్రాబాద్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications