సింధూ జలాల విషయంలో పాక్ కు బిగ్ షాక్.. భారత్ సంచలనం..
గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని నామరూపాల్లేకుండా చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. అలాగే కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల నిలిపివేత, ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు నిలిపివేత, వాఘా బోర్డర్ క్లోజ్, ఇరు దేశాల మధ్య గగనతలం మూసివేత ఇలా అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయినా పాకిస్తాన్ మాత్రం తన ప్రవర్తన మార్చుకోవడం లేదు. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తూనే ఉంది.
అయితే పాకిస్థాన్ తో ఉన్న సింధూ జలాల ఒప్పందం విషయంలో భారత్ కఠిన వైఖరిని ప్రదర్శించింది. రక్తం, నీరు కలిసి పారలేవు అని గతంలో ప్రధాని మోదీ చెప్పినట్టుగా సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. దాంతో పాకిస్థాన్ కు నీటి సమస్య తీవ్రమైంది. అయితే భారత్ నిర్ణయంపై పాకిస్థాన్ ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు, వేదికల ద్వారా ప్రశ్నించింది. అయితే తాజాగా సింధూ జలాల ఒప్పందంకు సంబంధించి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ పూర్తిగా తిరస్కరించింది. ఆ కోర్టుకు చట్టబద్ధత లేదని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఇదే విషయంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా ఏర్పాటైన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ మే 15న తీర్పును వెల్లడించింది. కానీ ఈ కోర్టును గానీ దాని చట్టబద్ధతను గానీ భారత్ ఎప్పుడూ గుర్తించలేదు. కాబట్టి ఈ కోర్టు ద్వారా జరిగే ఎలాంటి విచారణలు, ఇచ్చే తీర్పులు, నిర్ణయాలు ఏవైనా సరే భారత్ దృష్టిలో చెల్లవు అని స్పష్టం చేశారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో భారత్ నిర్మిస్తున్న కిషన్ గంగ, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్ ల రూపకల్పనపై పాకిస్థాన్ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్ట్ ల వల్ల తమకు వచ్చే నీటి లభ్యత తగ్గుతుందని పాకిస్థాన్ కీలక ఆరోపణలు చేసింది.
అయితే ఈ వివాదం పరిష్కారం కోసం ఓ న్యూట్రల్ ఎక్స్ పర్ట్ ను భారత్ కోరింది. కానీ పాకిస్థాన్ మాత్రం ఏక పక్షంగా అంతర్జాతీయ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ను ఆశ్రయించింది. దాంతో భారత్ ఈ తీర్పును బహిష్కరించింది.












Click it and Unblock the Notifications