రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను ముందుగానే గమనించడంతో భారీ ప్రమాదం తప్పింది. రైలును తక్షణమే నిలిపివేశారు. ప్రమాదానికి గురైన బోగీ నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
తిరువనంతపురం సెంట్రల్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ మధ్య రాకపోకలు సాగించే నంబర్ 12431 రాజధాని ఎక్స్ ప్రెస్ అది. శుక్రవారం సాయంత్రం 7:15 నిమిషాలకు తిరువనంతపురం నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరాల్సి ఉంది. మార్గమధ్యలో కోటా వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. ఈ తెల్లవారు జామున అయిదు గంటల సమయంలో బీ1 కోచ్, ఇంజిన్ కంపార్ట్‌మెంట్లలో మంటలు చెలరేగాయి.

ఆ వెంటనే ప్రయాణికులందరినీ వెంటనే సురక్షితంగా ఖాళీ చేయించారు. 15 నిమిషాల్లోనే కోచ్ ఖాళీ అయ్యింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అగ్నిప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడానికి కోటా స్టేషన్‌లో అమర్చిన ఆటోమేటెడ్ హూటర్ మోగడంతో స్థానిక రైల్వే యంత్రాంగానికి వెంటనే సమాచారం చేరింది. తక్షణమే స్యందించిన సీనియర్ రైల్వే అధికారులు, సహాయక బృందాలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అగ్నిప్రమాదాన్ని గుర్తించిన సమయంలో కోచ్‌ల్లో 68 మంది ప్రయాణికులు ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ (OHE) సరఫరాను తక్షణమే నిలిపివేశారు. మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా ఉండేందుకు ప్రమాదానికి గురైన కోచ్‌ను మిగిలిన బోగీల నుండి వేరు చేశారు. ముందుజాగ్రత్తగా పక్క బోగీలను కూడా ఖాళీ చేయించారు.
Fire in one of the coach of Rajdhani Express Train No. 12431 between Ratlam station and Kota Jn. Fire services here. pic.twitter.com/DFWZHBevvq
— Kartik Tiwari (@kartiktiwarii) May 17, 2026
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే కోటా రైల్వే డివిజన్ నుండి సహాయక, రెస్క్యూ బృందాలను ఘటనా స్థలానికి పంపారు. డివిజినల్ రైల్వే మేనేజర్ అనిల్ కల్రా సహా సీనియర్ రైల్వే అధికారులు, పోలీస్, అగ్నిమాపక శాఖల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాలను పర్యవేక్షించారు.
అగ్నిప్రమాదానికి గల కారణం ఏమిటనేది తెలియరావట్లేదు. రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మంటల మూలాన్ని గుర్తించేందుకు ప్రభావిత కోచ్‌ను, పరికరాలను పరిశీలిస్తున్నారు. గత మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. మే 15న నాంపల్లి రైల్వే స్టేషన్‌లో హైదరాబాద్-జైపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బీ1, బీ2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలోనూ ప్రాణనష్టం జరగలేదు.












Click it and Unblock the Notifications