పీఏగా ట్రాన్స్‌జెండర్ కు అవకాశం ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే..!!
టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి తీసుకున్న ఒక నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మాధవి తన వ్యక్తిగత కార్యదర్శిగా ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం కల్పించారు. బీకాం వరకు చదివినా ఉద్యోగం లభించక.. యాచిస్తూ జీవనం సాగిస్తున్న ఆ ట్రాన్స్‌జెండర్ కు చేయూత అందించారు. ఇప్పుడు ఆ పీఏను తన రాజకీయ.. అధికారిక కార్యక్రమాలలో భాగస్వామిని చేసారు. ఈ నిర్ణయం పైన మాధవి కి అందరి నుంచి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు అందుతున్నాయి.
టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి తన వ్యక్తిగత సహాయకురాలిగా (పీఏ) ఒక ట్రాన్స్‌జెండర్‌ను నియమించుకోవటం అందరినీ ఆకర్షించింది. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కొంతమంది ట్రాన్స్‌జెండర్లు యాచన కోసం వచ్చారు. వారిలో ఆ ట్రాన్స్‌జెండర్‌ను గమనించిన ఎమ్మెల్యే మాధవి ఆమెతో మాట్లాడారు. ఏం చదివావు? అని అడిగితే, బీకామ్ అని సమాధానమిచ్చింది.

ఏదైనా పని చేసుకోవచ్చు కదా! యాచించడం ఎందుకు? అని ఎమ్మెల్యే ప్రశ్నించగా భావోద్వేగం తో 'మాకు ఉద్యోగం ఎవరు ఇస్తారు మేడమ్... అందుకే ఇలా అడుక్కోవాల్సి వస్తోంది'' అని సమాధానం ఇచ్చింది. 'నేను ఉద్యోగం ఇస్తాను. జీతం 15 వేలు. అని ఎమ్మెల్యే చెప్పగా... మేము యాచిస్తేనే నెలకు 30 వేల వర కూ వస్తుంది మేడమ్'' అనే సమాధానం వచ్చింది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే.. ''సరే... 25 వేల జీతంతో పని చేస్తావా?'' అని అడగ్గా.. అందుకు వెంటనే అంగీకరించింది.
మాధవి నిర్ణయం పై ప్రశంసలు
దీంతో, తాను ఇచ్చిన మాట ప్రకారం వర్షిణిని తన కార్యాలయంలో పీఏగా నియమించుకున్నారు. ఆమె విధుల్లో చేరి సుమారు 20 రోజులు అయ్యింది. యాచన జీవితాన్ని విడిచి గౌరవప్రదమైన ఉపాధిలో అడుగుపెట్టి ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించింది. కష్టపడి బీకామ్ పూర్తి చేసింది. కుటుంబం నుంచి అంగీకారం లేకపోవడం, సమాజంలో అవమానాలు, ఉద్యోగాల్లో తిరస్కారం .. ఇలా సమస్యలు ఎదుర్కొని.. చివరకు జీవనోపాధి కోసం యాచనను నమ్ముకుంది. మరికొంత మంది ట్రాన్స్‌జెండర్లతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉండేది.
ఇప్పుడు ఆమె విద్యార్హత, ఉపాధి అవసరాన్ని గుర్తించిన ఎమ్మెల్యే, వెంటనే తన పీఏగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ సిగ్నళ్లు, రైళ్లలో ట్రాన్స్‌జెండర్లు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయానని, వారికి గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని గల్లా మాధవి వివరించారు.













Click it and Unblock the Notifications