పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ కు కవిత అల్టిమేటం!
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాధన సభ పేరుతో నిర్వహించిన సభలో కవిత ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు దసరా లోపు ప్రారంభించకపోతే ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల్లో పాదయాత్ర చేపడతామని హెచ్చరిక జారీ చేశారు.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు అతీగతి లేకుండా పోయింది: కవిత
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు అతీగతి లేకుండా పోయిందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని చౌదరిగూడెం మండలం లక్ష్మీదేవిపల్లిలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభను టీఆర్‌ఎస్ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ, రేవంత్ హయాంలో ప్రాజెక్టు పనులు ఏమాత్రం ముందుకు కదలలేదని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కవిత
నల్లమల పులిబిడ్డ అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలో తట్టెడు మట్టి కూడా తియ్యలేదని విమర్శలు గుప్పించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 33 వేల కోట్లు ఖర్చు చేసినా, ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు కవిత. కృష్ణా నది నీటిని సాగునీటికి వినియోగించుకునే అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం లేదని కవిత మండిపడ్డారు.
ఆ పని చెయ్యకుంటే పాదయాత్ర చేస్తాం
దసరా పండుగలోగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభం కాకపోతే ప్రాజెక్టు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టి ప్రజల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని బయటపెడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అసమర్ధ పాలనను ప్రజలలోకి తీసుకు వెళ్తామని కవిత అన్నారు. జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సాగునీటి సాధన కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. నీళ్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన ద్రోహానికి ప్రజలు వాళ్లను క్షమించరన్నారు.
తెలంగాణా రక్షణ సేన పుట్టింది అందుకే
పదేళ్లు అధికారంలో ఉన్న మన బీఆర్ఎస్ పాలకులే మనకు అన్యాయం చేశారు. పాలమూరు-రంగారెడ్డికి 33 వేల కోట్లు ఖర్చు చేసి 33 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు కవిత. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బీఆర్ఎస్ దుర్వినియోగం చేసిందని విమర్శించారు.దసరా నాటికి పాలమూరు-రంగారెడ్డి పనులను ప్రభుత్వం ప్రారంభించాలని, లేదంటే ప్రజా క్షేత్రంలో పోరాటం తప్పదని అల్టిమేటం ఇచ్చారు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకే తెలంగాణ రక్షణ సేన పుట్టిందన్నారు.పాలమూరు-రంగారెడ్డి కి కేంద్రం జాతీయ హోదా ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.













Click it and Unblock the Notifications