ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా వైజాగ్: నారా లోకేష్
విశాఖ జిల్లా తర్లువాడ వేదికగా 'గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఈ క్లౌడ్ డేటా సెంటర్ రూపుదిద్దుకోనుంది. తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో 600 ఎకరాల విస్తీర్ణంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్‌ను గూగుల్ నిర్మిస్తోంది.
గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, విశాఖపట్నం చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. భారతదేశంలోనే ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) గూగుల్ ద్వారా విశాఖకు రావడం గర్వకారణమన్నారు. ఇప్పటి వరకు 'ఉక్కు నగరం'గా పిలవబడే విశాఖ, ఇకపై 'డేటా సిటీ'గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం సహకరించిన అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ట్రా సంస్థలకు, భూములు ఇచ్చిన రైతులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

బుల్లెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధి..
గత ఐదేళ్ల విధ్వంసాన్ని తుడిచివేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రావడం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు నిదర్శనమని లోకేష్ అన్నారు. "దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే, ఏపీలో డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్ ఉంది" అని ఆయన అభివర్ణించారు. ప్రధాని మోదీ సహకారంతో దేశంలోని మొత్తం పెట్టుబడులలో 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని, ఇది ఏపీపై పారిశ్రామిక వర్గాలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం..
ఈ ఏఐ డేటా సెంటర్ ద్వారా రూ. 1.35 లక్షల కోట్ల పెట్టుబడి రానుందని, తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని లోకేష్ వివరించారు. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, మెకానికల్ వంటి వివిధ విభాగాల్లో వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. "ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని" అనే విధానానికి కట్టుబడి ఉంటూనే, అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరిస్తున్నామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు.
విమర్శలు - వికాసం
ప్రతిపక్ష పార్టీ వైఖరిపై లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. "ప్రజా ప్రభుత్వానిది గూగుల్ అయితే, ఆ పార్టీది గొడ్డలి" అని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి కొందరు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులు సృష్టించాలని చూశారని, కానీ అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. విశాఖ ప్రాంతాన్ని మొదటి 'ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్'గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని లోకేష్ ప్రకటించారు. నాడు చంద్రబాబు గారు సైబరాబాద్‌ను ఎలాగైతే గ్లోబల్ హబ్‌గా మార్చారో, నేడు విశాఖలోని ఏఐ డేటా సెంటర్ తో ఏపీ అభివృద్ధి పథంలో కొత్త ట్రాజెక్టరీని ఆవిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications