విజయ్ తో నన్ను పోల్చద్దు..! గతాన్ని గుర్తుచేసిన పవన్..!
తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ తొలిసారి పార్టీ పెట్టి రెండేళ్లలోనే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత.. ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కూడా అదే పని చేసి ఉండాల్సిందన్న చర్చ జరుగుతోంది. విజయ్ లాగే ఒంటరిగా వెళ్తే పవన్ కళ్యాణ్ కూడా విజయం సాధించే అవకాశం ఉందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ తో తనను పోల్చడంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇవాళ మంగళగిరిలో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేన విజయం ఒక్క రోజులో రాలేదని, దశాబ్దం పాటు ఎంతో నలిగిపోయామని పవన్ కళ్యాణ్ వ్యాఖానించారు. పక్క రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టి, హీరో విజయం సాధించి ముఖ్యమంత్రి కాకనే ఏపీలో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని మెసేజ్ లు పంపిస్తున్నారని పవన్ తెలిపారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడిగా ఇది కనిపిస్తోందన్నారు. పెళ్లి జరుగుతుంటే చిన్న పిల్లలు అటూఇటూ పరుగెట్టినట్లు ఇది ఉందన్నారు.

తాము కూడా పార్టీ పెట్టి ఒంటరిగా పోటీకి వెళ్లినప్పుడు ఎదురైన పరిస్ధితుల్ని పవన్ కళ్యాణ్ గుర్తుచేసారు. సరే వీళ్లు చెప్పినట్లుగానే ఒంటరిగా వెళ్లి రెండు చోట్ల పోటీ చేస్తే ఓడించారు కదా అన్నారు. కాబట్టి పోలికలు పెట్టొద్దన్నారు. నిజంగా తాను పదవే ప్రధాన అనుకుంటే 2009లో యూత్ వింగ్ తో సరిపెట్టుకోకుండా ఎంపీగానే పోటీ చేసే వాడిని అన్నారు. 2014లో ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నప్పుడు మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉందన్నారు. కానీ ఓ పార్టీని నడపాలంటే చాలా అంశాలు ఉంటాయన్నారు. కమ్యూనిస్టుల నుంచి కాన్షీరాం వరకూ పార్టీల్ని నడిపేందుకు చాలా నలిగిపోయారన్నారు. 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణంలో గెలుస్తానో, ఓడిపోతానో తెలియకుండా ముందుకు వెళ్లానన్నారు. అందరూ తనను వదిలేసినా ఇవాళ పార్టీని తాను ముందుకు తీసుకెళ్లగలనన్నారు.












Click it and Unblock the Notifications