3 రూపాయలకే గగ్గోలా ? పెట్రోల్ ధర పెంపుపై సాయిరెడ్డి షాకింగ్..!
అమెరికా-ఇరాన్ సంక్షోభాన్ని కారణంగా చూపుతూ కేంద్రం ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచింది. లీటరు పెట్రోల్ పై 3 రూపాయలు, లీటరు డీజిల్ పై 2 రూపాయల చొప్పున ధరలు పెరిగాయి. దీన్ని బీజేపీతో పాటు ఎన్డీయే మిత్రపక్షాలు సమర్దించుకుంటుండగా.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఇరాన్ యుద్ధం విషయంలో కేంద్రం సమర్ధంగా వ్యవహరించలేకపోయిందని, దాని ఫలితమే ఈ చమురు ధరల పెంపు అని విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)మాత్రం చమురు ధరల పెంపును సమర్థిస్తూ ఇవాళ ట్వీట్ చేశారు. ప్రపంచం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో, పెట్రోల్, డీజిల్ ధరలలో రూ. 3 పెంపు చాలా స్వల్పమైనది అంటూ ఆయన ఇందులో వ్యాఖ్యానించారు. అలాగే ఇది అవసరమైనది అని కూడా తెలిపారు. ఈ నిర్ణయంతో పాటు, వేలాది ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, అన్ని పట్టణ ప్రాంతాలలో లాస్ట్ మైల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను ప్రోత్సహించడం కూడా జరగాలని ప్రధాని మోడీకి ఆయన సూచించారు.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, ప్రజా రవాణాకు ప్రోత్సాహం సంగతి ఎలా ఉన్నా సరే.. చమురు ధరల పెంపు విషయంలో మాత్రం ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. నాలుగేళ్లుగా చమురు ధరలు పెంచలేదని ప్రభుత్వం చెప్పుకుంటుంటే.. అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నా అదే రేటుకు ఎందుకు పెట్రోల్, డీజిల్ అమ్మారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి కేంద్రం వద్ద సమాధానం లేదు. ఇప్పుడు అంతర్జాతీయ పరిస్ధితుల్ని సాకుగా చూపుతూ పెట్రో ధరలు పెంచడం ఓ ఎత్తయితే, భవిష్యత్తులో ఈ ధరలు దశల వారీగా మరింత పెరుగుతాయన్న వార్తలు వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.














Click it and Unblock the Notifications