విజయ్ కు AIADMK కూటమి పార్టీ గుడ్ న్యూస్ ..! గవర్నర్ కు కీలక వినతి..!
తమిళనాడులో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఫలితాల తర్వాత హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో అతిపెద్ద పార్టీ టీవీకే అధినేత విజయ్ (Vijay) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ తర్వాత మెజార్టీ నిరూపించుకుంటారని అంతా భావించగా.. అందుకు విరుద్దంగా గవర్నర్ కు ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే కూటమిలో భాగస్వామ్య పార్టీ పీఎంకే (PMK) విజయ్ కు మద్దతుగా నిలుస్తోంది.
తమిళనాడులో నెలకొన్న అసాధారణ రాజకీయ వాతావరణం దృష్ట్యా, రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ తక్షణమే ఆహ్వానించాలని పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్
డిమాండ్ చేశారు. ప్రజల తీర్పుకు తలవంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, ఈ ప్రక్రియను ఆలస్యం చేయకూడదని,వెంటనే ఆహ్వానం పంపాలని ఆయన చెన్నైలో ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకే కూటమిలో ఉన్న పీఎంకేకు నాలుగు సీట్లు ఉన్నాయి. కానీ అన్నాడీఎంకేతో పాటు ఆ కూటమిలో పార్టీల మద్దతు తీసుకునేందుకు విజయ్ సుముఖంగా లేరు.

అయితే రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇప్పటికే టీవీకేకు తమ మద్దతును ప్రకటించాయని, వీసీకే అధినేత తిరుమావళవన్ కూడా అదే బాటలో నడవాలని రాందాస్ సూచించారు. ఆయన తన మద్దతును ప్రకటిస్తే, గవర్నర్ విజయ్‌ను లాంఛనంగా ఆహ్వానించి, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించాలన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నా తమ్ముడు తిరుమావళవన్ తక్షణమే టీవీకేకు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని రాందాస్ తెలిపారు. అలా చేయడం ద్వారా అతను తమిళనాడు ప్రజల మనోభావాలను గౌరవించి, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తారన్నారు.













Click it and Unblock the Notifications