ఈ ఆలయంలో ప్రసాదంగా డబ్బు.. ఎక్కడ ? ఏంటా స్టోరీ ??
సాధారణంగా ఆలయాల్లో లడ్డూలు, పులిహోర వంటి ప్రసాదాలను భక్తులకు అందించడం చూస్తుంటాం. అయితే రాజస్థాన్‌లోని బానోడా బాలాజీ ఆలయం తన విశిష్ట ఆచారంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ భక్తులకు డబ్బును ప్రసాదంగా అందిస్తారు. ఇది ఆలయానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ప్రసాదంగా పొందిన డబ్బును భద్రంగా ఉంచుకోవడం వల్ల తమకు ఐశ్వర్యం సిద్ధిస్తుందని, వ్యాపారాల్లో లాభాలు వస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. కోరికలు నెరవేరిన పిదప, పొందిన సొమ్ముకు మరికొంత కలిపి ఆలయానికి తిరిగి సమర్పించడం ఇక్కడ విలక్షణమైన ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఈ ప్రత్యేక సంప్రదాయంతో, బానోడా బాలాజీ ఆలయం మహిమాన్విత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దూర ప్రాంతాల నుంచీ వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తారు. నిత్యం ఆలయం కిటకిటలాడుతూ, పండుగలు, ఉత్సవాల వేళ రద్దీ మరింత పెరుగుతుంది.
డబ్బు ప్రసాదంతో పాటు, లడ్డు, పులిహోర వంటి ఇతర ప్రసాదాలను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో, ఆలయ విస్తరణ పనులు చేపట్టారు. ఉత్సవాల సమయంలో నిర్ణీత దర్శన వేళలు పాటిస్తూ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
బానోడా బాలాజీ కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది 13 పవిత్ర ఆలయాల సమాహారంగా వెలసిన విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రం. పంచముఖి హనుమాన్, జగన్నాథుడు, ఖటుశ్యామ్ బాబా, శ్రీ శేషావతార్ కల్లాజీ వంటి మహిమాన్విత విగ్రహాలు భక్తుల కోరికలు తీర్చే దైవశక్తులుగా పూజలందుకుంటాయి.
పండిట్ కైలాష్ శర్మ ఆధ్వర్యంలో నిరంతరంగా జరిగే రామాయణ పారాయణం ఈ పుణ్యక్షేత్రానికి అసలైన ఆధ్యాత్మిక వైభవాన్ని చేకూర్చుతోంది. గత రెండు దశాబ్దాలుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని 200కు పైగా గ్రామాల్లో ఈ పవిత్ర పారాయణం భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తోంది. అలాగే సిద్ధిదాత్రి దేవి ఆలయంలోని 16 రోజుల విశిష్ట నవరాత్రి మహోత్సవాలు వేలాది భక్తులను ఆకర్షించే ప్రధాన ఆధ్యాత్మిక వేడుకలుగా పేరొందాయి. ఈ ఉత్సవాలు ఆలయ ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేస్తున్నాయి.












Click it and Unblock the Notifications