సీఎం విజయ్ మార్క్ పాలన షురూ .. ఒక్కో నిర్ణయం ఒక్కో డైమండ్ అంతే !!
తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు సీఎం విజయ్ (Vijay). ఎన్నికల్లో ఘన విజయం తర్వాత అధికారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే సంచలన నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వెండితెరపై 'దళపతి'గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్.. ఇప్పుడు రాజకీయ నాయకుడిగానే కాదు.. సామాజిక సంస్కరణల వైపు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రిగా చర్చనీయాంశమయ్యారు.
ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తు, కుటుంబ వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 717 టాస్మాక్ (TASMAC) మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించడం పెద్ద చర్చకు దారితీసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) ఆధ్వర్యంలో నడుస్తున్న 717 మద్యం దుకాణాలను వచ్చే రెండు వారాల్లోగా మూసివేయాలని అధికారులకు సీఎం విజయ్ ఆదేశించారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,765 టాస్మాక్ రిటైల్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో తాజాగా గుర్తించిన 717 దుకాణాల్లో 276 ప్రార్థనా స్థలాల సమీపంలో ఉండగా, 186 విద్యాసంస్థల వద్ద, మరో 255 బస్టాండ్ల దగ్గర కొనసాగుతున్నాయి. ప్రజల శ్రేయస్సు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి..
అలానే మద్యం దుకాణాల నియంత్రణతో పాటు మహిళల భద్రత విషయంలో కూడా సీఎం విజయ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం ప్రత్యేక మహిళా భద్రతా దళాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, నేరాలను అరికట్టేందుకు ఫాస్ట్ ట్రాక్ మానిటరింగ్ వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
యాంటీ డ్రగ్ యూనిట్స్..
ఇక విద్యార్థుల్లో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక యాంటీ డ్రగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ యూనిట్లకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ త్వరలోనే కార్యాచరణ ప్రారంభించనున్నట్లు సమాచారం.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్..
మరోవైపు గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్‌కు సీఎం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించడమే ఈ నిర్ణయం లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ..
మొత్తంగా సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "సినిమాల్లో చెప్పింది ఇప్పుడు పాలనలో చేసి చూపిస్తున్నారు", "యువత కోసం ఆలోచించే సీఎం" అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications