పెళ్లి మధ్యలో వధువుకు వరుడు బిగ్ ట్విస్ట్ ! ఆ ఒక్క ప్రశ్నతో మంటపం అంతా షాక్..?
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం, ముఖ్యంగా ఇరాన్ యుద్ధ పరిణామాలతో భారత దేశంలో వంట గ్యాస్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులకు నిదర్శనంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ వింత వివాహం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. సాధారణంగా పెళ్లిళ్లలో కట్నకానుకలు లేదా ఇతర డిమాండ్ల గురించి వింటూ ఉంటాం, కానీ ఇక్కడ జరిగిన సంఘటన పూర్తి భిన్నంగా ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో వరుడు అశోక్ భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక విచిత్రమైన ప్రశ్న అడిగాడు. పెళ్లి తంతు జరుగుతున్న సమయంలోనే గ్యాస్ ధరలు పెరిగితే లేదా కొరత ఏర్పడితే ఇబ్బందులు వస్తాయని ముందే ఊహించి, అందరి ముందే వధువును ప్రశ్నించాడు. ఈ సంఘటన ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

పెళ్లి వేడుకల సందడిలో ఉన్న అతిథులను, బంధువులను ఆశ్చర్యపరిచేలా అశోక్, "ఇంట్లో ఒకవేళ గ్యాస్ సిలిండర్ లేకపోతే, నువ్వు కట్టెల పొయ్యి మీద వంట చేయగలవా?" అని వధువును నేరుగా అడిగాడు. ఈ ఊహించని ప్రశ్న విన్న వారంతా ఒక్కసారిగా నిశ్శబ్ధమయ్యారు. పెళ్లిలో ఇలాంటి ప్రశ్న ఎంటని అందరూ అవాక్కయ్యారు.
అయితే వధువు ఏ మాత్రం తడబడకుండా, తాను కట్టెల పొయ్యి మీద వంట చేయగలనని తెలిపింది. ఎటువంటి ఇబ్బంది లేదని ధైర్యంగా సమాధానం చెప్పింది. ఆమె సమాధానంతో సంతోషించిన వరుడు, వివాహ తంతును ముందుకు కొనసాగించాడు. వైరల్ వీడియోలో పెళ్లైన తర్వాత కూడా వధూవరులను ప్రశ్నించగా.. భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదనే ఈ ప్రశ్న అడిగానని వరుడు వివరణ ఇచ్చాడు. అందుకు వధువు ముసిముసిగా నవ్వింది.
ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వరుడి ఆలోచనను "చాలా ఆచరణాత్మకమైనది" అని ప్రశంసిస్తే, ఇంకొందరు సరదాగా వ్యాఖ్యానించారు. "ఈ రోజుల్లో పెళ్లి కూతురు దొరకడమే కష్టం అనుకుంటే, ఇప్పుడు 'పొయ్యి పరీక్ష' కూడా మొదలైందా?" అంటూ నెటిజన్లు జోకులు పేల్చారు. మొత్తానికి ఈ "కట్టెల పొయ్యి" ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని వింత ప్రశ్నలు ఎదురవుతాయో అని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications