ప్రారంభ ఫలితాల్లో డీఎంకే-టీవీకే హోరాహోరీ
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ఆరంభమైంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇదివరకే వెల్లడైన నేపథ్యంలో వీటిపైనే అందరి చూపూ నిలిచింది. ప్రారంభ ఫలితాలు ఉత్కంఠతకు గురి చేస్తోన్నాయి.
తమిళనాడులో ప్రారంభ ఫలితాల్లో డీఎంకే, టీవీకే హవా కనిపించింది. డీఎంకే ఆరు స్థానాల్లో ఆధిక్యత సాధించగా.. టీవీకే అభ్యర్థులు మూడు చోట్ల లీడింగ్ లో ఉన్నారు. ఏఐఏడీఎంకే ఒక స్థానంలో పైచేయి సాధించింది ప్రారంభ ఫలితాల్లో. డీఎంకే కంచుకోట పెరంబూర్ లో టీవీకే చీఫ్, ఆ పార్టీ అధినేత విజయ్ భారీ ముందంజ వేశారు. ఇక్కడ తన సమీప ప్రత్యర్థి, డీఎంకేకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ డీ శేఖర్ పై ఆధిక్యత సాధించారు.

కొళత్తూరులో కూడా డీఎంకే భారీ ఆధిక్యత సాధించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోటీ చేశారిక్కడ. తన సమీప ప్రత్యర్థి సంతాన కృష్ణన్ పై తొలి రౌండ్ నుంచే లీడింగ్ కనబరిచారు. పలు జిల్లాల్లో డీఎంకే అభ్యర్థులు ఆధిక్యతలో ఉండగా.. టీవీకే వారికి గట్టి పోటీ ఇస్తోన్నట్టు కనిపిస్తోంది. ప్రారంభ ఫలితాల్లో డీఎంకే ఆధిక్యత సాధిస్తోండటంతో ఆ పార్టీ కార్యాలయం వద్ద సందడి మిన్నంటింది. కార్యకర్తలు, నాయకులు హర్షధ్వానాలు చేస్తోన్నారు.
అటు చెన్నై పనైయూర్ లోని టీవీకే కార్యాలయం వద్ద కూడా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విజయ్ అభిమానుల కోలాహలం నెలకొంది. పార్టీ ప్రాంగణంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. డీఎంకేకు గట్టి పోటీ ఇస్తోండటం క్యాడర్ లో ఉత్సాహం నింపింది. విజయ్ కు జిందాబాద్ కొడుతూ కనిపించారు పార్టీ నాయకులు. ఆధిక్యత చేతులు మారుతున్నప్పటికీ- వారు నిరాశ చెందలేదు. అనుకున్న దాని కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications