DMK తో పొత్తుపై అన్నాడీఎంకే సంచలన ప్రకటన
తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని ఉత్కంఠ నెలకొంది. 2026 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కోటపై జెండా ఎగురవేసేందుకు పార్టీల మధ్య సాగుతున్న మైండ్ గేమ్ 'తమిళ తంబీల'ను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఒకవైపు దళపతి విజయ్ 'మ్యాజిక్ ఫిగర్' కోసం అష్టకష్టాలు పడుతుంటే, మరోవైపు దశాబ్దాల ప్రత్యర్థులు డీఎంకే-అన్నాడీఎంకే ఒక్కటవుతున్నాయన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే (TVK) అధినేత విజయ్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. అయితే, మెజారిటీ నిరూపించుకునే విషయంలో గవర్నర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో దళపతికి షాక్ తగిలింది.
కనీసం 118 మంది సభ్యుల మద్దతు ఉంటేనే పచ్చజెండా ఊపుతానని గవర్నర్ తేల్చిచెప్పారు. విజయ్ రెండు చోట్ల గెలిచినా ఒక ఓటే లెక్కలోకి వస్తుంది కాబట్టి, ఆయన బలం 107 కి పడిపోయింది. కాంగ్రెస్ (5 సీట్లు) మద్దతు ప్రకటించినా, ఇంకా 6 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. దీంతో గురువారం జరగాల్సిన విజయ్ ప్రమాణస్వీకారం వాయిదా పడింది.

డీఎంకే-అన్నాడీఎంకే పొత్తుపై రచ్చ!
ఇదే సమయంలో ఒక వింత వార్త చెన్నై వీధుల్లో షికారు చేస్తోంది. దాదాపు 40 ఏళ్లుగా కత్తులు దూసుకున్న డీఎంకే (59 సీట్లు), అన్నాడీఎంకే (47 సీట్లు) కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయన్న ప్రచారం కలకలం రేపింది. ఈ వార్తలపై అన్నాడీఎంకే నిప్పులు చెరిగింది. "డీఎంకే మా బద్ధశత్రువు.. వారితో పొత్తు ఉండే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేసింది. ఈ వదంతుల వెనుక విజయ్ పార్టీ కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఇన్నాళ్లూ అతడు మంచి నటుడనే తెలుసు, కానీ ఇప్పుడు మంచి రచయిత కూడా అయ్యాడు. తన రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ చేస్తున్నాడు" అని విజయ్ పేరు ఎత్తకుండానే ఎద్దేవా చేసింది.
జంగీ కుస్తీలో ట్విస్టులు.. గవర్నర్ కఠిన నిర్ణయం!
ఒకవైపు అన్నాడీఎంకే మద్దతు కోరినట్లు వార్తలు వస్తున్నా, డీఎంకే మాత్రం తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని భీష్మించుకు కూర్చుంది. ప్రజల తీర్పుకు విరుద్ధంగా వెళ్లి అప్రతిష్ట పాలవ్వలేమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు వీసీకే, సీపీఐ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతిచ్చే విషయంలో ఊగిసలాడుతున్నాయి. దీంతో 'మ్యాజిక్ ఫిగర్' అందుకోవడం విజయ్‌కు హిమాలయ పర్వతాన్ని ఎక్కినంత కష్టంగా మారింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఆర్లేకర్ తమిళనాడు 16వ శాసనసభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బంతి పార్టీల కోర్టులో ఉంది. మరి ఆరుగురు ఎమ్మెల్యేలను విజయ్ ఎలా సంపాదిస్తారు? లేక తమిళనాడులో మళ్ళీ ఎన్నికల మేఘాలు కమ్ముకుంటాయా? అన్నది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications