సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత ఇకలేరు..
సోషల్ మీడియా ఒక సాధారణ వ్యక్తిని కూడా ఒక్కరోజులోనే సెలబ్రిటీగా మార్చగలదని నిరూపించిన వారిలో "కుర్చీ తాత" అలియాస్ మహమ్మద్ పాషా ఒకరు. ఒక చిన్న డైలాగ్‌తో ప్రారంభమైన ఆయన ప్రయాణం, కోట్లాది మంది నెటిజన్ల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అయితే ఆ నవ్వులు పంచిన ముఖం ఇక కనిపించదన్న వార్త అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో కుర్చీ తాత కన్నుమూయడంతో సోషల్ మీడియా అంతా సంతాప సందేశాలతో నిండిపోయింది.
బిచ్చగాడి నుంచి వైరల్ స్టార్ వరకు
హైదరాబాద్ నగరంలోని కృష్ణానగర్, కృష్ణకాంత్ పార్క్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు మహమ్మద్ పాషా. సాధారణంగా ఎవరూ పట్టించుకోని అతను, ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పిన "కుర్చీ మడతపెట్టి..." అనే డైలాగ్‌తో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు. ఆ ఒక్క మాటే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సోషల్ మీడియాలో ఆ డైలాగ్ ట్రెండ్ అవుతుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ దానిని గమనించారు.

ఆ తర్వాత "గుంటూరు కారం" చిత్రంలోని ప్రత్యేక పాటలో ఆ డైలాగ్‌ను ఉపయోగించారు. ఆ పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఒక్క పాటతో ఆయనకు అనేక ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ఫాలోయింగ్, ప్రజాదరణ వచ్చాయి. యూట్యూబ్ ఛానళ్లు, షార్ట్ వీడియోలు, మీమ్స్ ద్వారా ఆయన పేరు మార్మోగిపోయింది. "వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా వైరల్ కావచ్చు" అని నిరూపించిన వ్యక్తిగా కుర్చీ తాత నిలిచిపోయాడు.
మళ్లీ కష్టాల్లోకి జారిన జీవితం
అయితే వైరల్ ఫేమ్ ఎక్కువ కాలం నిలవలేదు. కొంతకాలం తర్వాత ఆయనకు వచ్చిన అవకాశాలు తగ్గిపోయాయి. మళ్లీ పాత జీవితం వైపే అడుగులు వేశాడు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఆయనను వెంటాడాయి. వృద్ధాప్యం కారణంగా పని చేయలేకపోయిన ఆయన, తిరిగి భిక్షాటన ద్వారానే జీవనం సాగించాల్సి వచ్చింది. కుర్చీ తాతకు మద్యం అలవాటు ఎక్కువగా ఉండేదని, దీని వల్ల కాలేయ సంబంధిత సమస్యలు కూడా వచ్చాయని ఆయనకు దగ్గరగా ఉన్నవారు చెబుతున్నారు. పలుమార్లు ఆసుపత్రుల్లో చికిత్స పొందినా ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదని సమాచారం.
పార్క్‌లో కుప్పకూలిన కుర్చీ తాత..
బుధవారం రాత్రి కృష్ణకాంత్ పార్క్ సమీపంలో నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. అక్కడున్న స్థానికులు వెంటనే గమనించి సీపీఆర్ చేసి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తీవ్ర ఎండలు, వడదెబ్బ, గుండెపోటు కారణంగానే ఈ విషాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుర్చీ తాత మరణ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.












Click it and Unblock the Notifications