విజయ్ గేమ్ స్టార్ట్
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు గడువు సమీపించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఈ నెల 4న కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇదివరకే వెల్లడైన నేపథ్యంలో వీటిపైనే అందరి చూపూ నిలిచింది. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఆయా పార్టీలన్నీ కూడా వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నాయి.
ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామంతో రాజకీయ పార్టీలు రిసార్ట్ రాజకీయాలకు సిద్ధమవుతున్నాయి. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తమ గెలిచిన అభ్యర్థులందరినీ ఒక చోటికి చేర్చనుంది. దీనికోసం మహాబలిపురం సమీపంలోని పూంజేరి వద్ద ఓ రిసార్ట్‌ను బుక్ చేసింది. గెలిచిన అభ్యర్థులందరూ కూడా అక్కడికి వెళ్లాల్సి ఉంటుందని సూచించింది.

మే 4న విజయం సాధించిన తమ పార్టీ అభ్యర్థులు ఆలస్యం చేయకుండా పనైయూరులోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ గతంలోనే సూచించారు. గెలిచే అభ్యర్థుల సంఖ్య అంచనాలకు మించి ఉండొచ్చనే ఉద్దేశంతో వారందరినీ కూడా మహాబలిపురం పూంజేరీ రిసార్ట్ కు తరలించాలని పార్టీ నిర్ణయించారు. దీనికోసం పూంజేరి వద్ద రిసార్ట్ ను బుక్ చేయడంతో పాటు అభ్యర్థులను తరలించడానికి ప్రత్యేకంగా మూడు బస్సులను కూడా అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు సమాచారం.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విజయ్ తన పార్టీ లీగల్ వింగ్‌ను ఇప్పటికే ఆదేశించారు. హార్స్ ట్రేడింగ్ కు పాల్పడే పార్టీలపై చట్టపరంగా పోరాడటానికి అవసరమైన ఏర్పాట్లను సైతం ఆయన పూర్తి చేసుకున్నారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ రోజున శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భద్రతను పటిష్టం చేయాలని ఎన్నికల సంఘానికి విన్నవించారు కూడా. పార్టీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున శనివారమే కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. వినతిపత్రాన్ని అందజేశారు.
మరోవైపు, అధికార డీఎంకే అతిపెద్ద పార్టీగా తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఉంది. కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని తమ పార్టీ కార్యకర్తలను ఆదేశించింది. డీఎంకే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని పార్టీ అధికార ప్రతినిధి ధరణీధరన్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖరారైందని, ప్రతిపక్షంగా ఎవరు ఉంటారనేదే తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు. 40 నుంచి 45 శాతం ఓట్లు తమ పార్టీకి పోల్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications