కేరళ సీఎం పినరయి విజయన్ అదృశ్యం?
కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం వింత పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం సాధారణంగా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరగాలి. కానీ కేరళలో మాత్రం ఓ వింత నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. దీనికి ప్రధాన కారణం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గత కొన్ని రోజులుగా బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడమే. కేరళ సీఎం విజయన్ అనారోగ్య కారణాల రీత్యా ప్రజలకు దూరంగా ఉన్నారా లేక వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా అనే చర్చ ఇప్పుడు కేరళ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది.
అనారోగ్యమా? వ్యూహాత్మక మౌనమా?
కేరళ సీఎం పినరయి విజయన్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకున్నారని.. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అయితే ఆపరేషన్ ముగిసి చాలా రోజులవుతున్నా ఆయనకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు గానీ.. వీడియోలు గానీ బయటకు రాలేదు. దీంతో విపక్షాలు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పాలన స్తంభించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

సొంత రాష్ట్రంలో వైద్యం వద్దా?
ఎన్నికల ప్రచారంలో కేరళ ఆరోగ్య వ్యవస్థ దేశానికే ఆదర్శమని పినరయి విజయన్ పదేపదే చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన చికిత్స కోసం పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు వెళ్లడంపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. కేరళలోనే మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి బయట రాష్ట్రానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి ఇటీవల ఆన్‌లైన్ ద్వారా కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారని, పాలన సజావుగా సాగుతోందని ఎల్డీఎఫ్ వర్గాలు సమాధానమిస్తున్నాయి.
హ్యాట్రిక్ విజయంపై ఎల్డీఎఫ్ ధీమా
దాదాపు 81 ఏళ్ల వయసున్న పినరయి విజయన్ కేరళ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదే జరిగితే కేరళ రాజకీయ చరిత్రలో ఓ సరికొత్త రికార్డు సృష్టించబడినట్లే అవుతుంది. ముఖ్యమంత్రి అనారోగ్యంపై వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని వారు కొట్టిపారేస్తున్నారు.
కాంగ్రెస్‌లో సీఎం పదవి కోసం పోటీ
మరోవైపు పదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తామనే గట్టి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఫలితాలు రాకముందే పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం నేతల మధ్య పోటీ మొదలైందని సమాచారం. ఐక్య ప్రజాస్వామ్య కూటమి (UDF) తరఫున సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై పార్టీలో అంతర్గత చర్చలు జోరుగా సాగుతున్నాయి. పినరయి విజయన్ గైర్హాజరీని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
మే 4న తేలనున్న భవితవ్యం
పినరయి విజయన్ మౌనం వెనుక ఉన్న రహస్యమేమిటో.. ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందో తెలియాలంటే వచ్చే వారం వెలువడనున్న ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. మే 4న వెలువడే ఫలితాలు కేరళలో ఎల్‌డీఎఫ్ హ్యాట్రిక్ కొడుతుందా లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పీఠాన్ని దక్కించుకుంటుందా అన్నది తేల్చిచెప్పనున్నాయి.












Click it and Unblock the Notifications