నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం: ఏసీ బోగీల్లో చెలరేగిన మంటలు..
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాట్‌ఫారమ్ నంబర్ 4పై నిలిచి ఉన్న 'హైదరాబాద్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12720)'కు చెందిన బి1, బి2 ఎయిర్ కండిషన్డ్ (AC) బోగీలలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి 7:30 గంటలకు ఈ రైలు జైపూర్‌కు బయలుదేరాల్సి ఉండగా, సాయంత్రం 6:20 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బోగీలలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రాణనష్టం తప్పింది.
రైలు బోగీల నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు రావడాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. తక్షణమే ఫైర్ కంట్రోల్ రూమ్‌తో పాటు, హైడ్రా (HYDRAA) డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. సాయంత్రం 6:40 గంటలకు సమాచారం అందిన వెంటనే నిలోఫర్ ఔట్‌పోస్ట్ నుండి అగ్నిమాపక యంత్రాలు, గౌలిగూడ నుండి వాటర్ బౌజర్లు సంఘటనా స్థలానికి పరుగులు తీశాయి. హైడ్రా DRF బృందాలు, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

ఏసీ యూనిట్ నుంచే ప్రమాదం?
హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి తగరం వెంకన్న స్వయంగా నాంపల్లి స్టేషన్‌కు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పరిస్థితి తీవ్రతను బట్టి అదనపు సహాయం కోసం అసెంబ్లీ ఫైర్ టీమ్, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దించారు. ప్రాథమిక పరిశీలన ప్రకారం.. బి1 బోగీలోని ఎయిర్ కండిషనింగ్ (AC) యూనిట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ వల్లే మొదట మంటలు ప్రారంభమై, పక్కనే ఉన్న బి2 బోగీకి కూడా వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు.
అధికారులు సమన్వయంతో సాహసోపేతమైన చర్యలు చేపట్టడం వల్లే మంటలు రైలులోని మిగతా బోగీలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. ప్రమాద సమయంలో రైలు ఖాళీగా ఉండటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం సంభవించలేదని రైల్వే వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) May 15, 2026
🔹 నాంపల్లి స్టేషన్‌లో ఆగి ఉన్న హైదరాబాద్-జైపూర్ ఎక్స్‌ప్రెస్ (Hyderabad-Jaipur Express) లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
🔹 ఒక బోగీలో ప్రారంభమైన మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
🔹 రైల్వే సిబ్బంది ,అగ్నిమాపక… pic.twitter.com/IdLnODGqwJ














Click it and Unblock the Notifications