విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, సంచలన తీర్పు
రెక్కాడితే గానీ డొక్కాడని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడతడు. విమానం ఎక్కడం, ఆకాశంలో ప్రయాణించడం అంటే అతడి లాంటి వాళ్లకు ఒక జీవితకాలపు కల. ఆ అపురూపమైన క్షణాలను, తన కలల ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా మొబైల్‌లో దాచుకోవాలనుకున్నాడు. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో విమానం లోపల కొన్ని ఫొటోలు, వీడియోలు క్లిక్ మనిపించాడు. కానీ, ఆ అమాయకపు సరదా.. పరాయి దేశంలో ఘోర నేరంగా మారుతుందని, తన జీవితంలో పదేళ్ల చీకటిని నింపుతుందని అతడు కలలో కూడా ఊహించలేదు. అంతర్జాతీయ కఠిన చట్టాలపై కనీస అవగాహన లేకపోవడంతో ఒక భారతీయ వలస కార్మికుడు దుబాయ్ కోర్టులో పదేళ్ల జైలు శిక్షకు గురైన హృదయవిదారక ఘటన ఇది.
బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా రఫీ ఇందర్వా గ్రామానికి చెందిన వసీం అక్రమ్ నిరుపేద యువకుడు. ఇంట్లోని ఎనిమిది మంది ఆకలి తీర్చడం కోసం, భార్య పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం సుమారు 22 నెలల క్రితం కూలి పనికై దుబాయ్ బయలుదేరాడు. మొదటిసారి అంతర్జాతీయ విమానం ఎక్కిన ఉత్సాహంలో.. ఆకాశంలో విమానం ప్రయాణిస్తుండగా చుట్టుపక్కల దృశ్యాలను, లోపలి వాతావరణాన్ని మురిపెంగా రికార్డ్ చేసుకున్నాడు. అయితే, దుబాయ్ (యూఏఈ) కఠినమైన పర్సనల్ ప్రైవసీ, అంతర్జాతీయ సైబర్ చట్టాల ప్రకారం విమానం లోపల అధికారుల అనుమతి లేకుండా ఫొటోగ్రఫీ చేయడం అత్యంత తీవ్రమైన భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఈ విషయం తెలియని వసీం, ఆ ఫొటోలను తన ఫోన్ మెమొరీలోనే ఉంచుకున్నాడు.

ప్రార్థన ముగించుకుని వస్తుండగా విధి వంచించింది..
ఈ ఘటన జరిగిన చాలా నెలల తర్వాత దుబాయ్ భద్రతా సంస్థల స్కానింగ్‌లో వసీం ఫోన్ డేటా చిక్కినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు నెలల క్రితం ఒక శుక్రవారం నాడు మధ్యాహ్నం నమాజ్ ముగించుకుని వసీం రూమ్‌కు వస్తుండగా దుబాయ్ పోలీసులు అతడిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. "నేను కేవలం మెమరీస్ కోసమే ఆ ఫొటోలు తీసుకున్నాను.. నాకు ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు" అని వసీం ఎంత మొరపెట్టుకున్నా అక్కడి చట్టాలు ఆ అమాయకత్వాన్ని అంగీకరించలేదు. స్థానిక న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ అనంతరం, మే 14న కోర్టు అతడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ షాకింగ్ తీర్పునిచ్చింది.
'మాకు వేరే దిక్కు లేదు'.. రోదిస్తున్న కుటుంబం
వసీం పంపే కొద్దిపాటి జీతం డబ్బులపైనే ఆ వృద్ధ తల్లిదండ్రులు, సోదరి, ఇద్దరు పసిపిల్లలు, అనారోగ్యంతో ఉన్న భార్య సల్మా ఖాతూన్ ఆధారపడి బతుకుతున్నారు. ఇంటికి ఆధారమైన వ్యక్తి జైలుపాలవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. వసీం తల్లి షైదా ఖాతూన్ కన్నీరుమున్నీరవుతూ.. "మొదట నా కొడుకుతో పాటు మరికొందరిని పోలీసులు విచారించి వదిలేశారు. కానీ వసీం ఫోన్‌లో విమానంలో తీసుకున్న ఆ ఫొటోలు, వీడియోలు దొరకడంతో అతడిని జైలుకు పంపారు. నా కొడుకు అమాయకుడు, అతడికి అక్కడి నియమాలు తెలియవు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం చొరవపైనే ఆశలు
బాధిత కుటుంబం గోపాల్‌గంజ్ జిల్లా మెజిస్ట్రేట్ పవన్ కుమార్ సిన్హాను కలిసి తమ బిడ్డను కాపాడాలని వేడుకుంది. ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ సానుకూలంగా స్పందిస్తూ.. "ఒక సామాన్య యువకుడికి విదేశంలో ఇలాంటి శిక్ష పడటం అత్యంత బాధాకరం. ఈ నిరుపేద కుటుంబానికి న్యాయం జరగాలంటే దౌత్యపరమైన జోక్యం అవసరం. అందుకే ఈ ఉదంతంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను తక్షణమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, విదేశాంగ శాఖకు పంపాలని ఆదేశించాను" అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి, దుబాయ్ అధికార యంత్రాంగంతో మాట్లాడితేనే వసీంకు విముక్తి లభిస్తుందని ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది.














Click it and Unblock the Notifications