రూపాయి చరిత్రలోనే అత్యంత ఘోరమైన పతనం, డాలర్ ప్రళయం

అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా కుప్పకూలింది. అమెరికా ట్రెజరీ దిగుబడులు రికార్డు స్థాయికి చేరడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల మంట, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల (Outflows) నిరంతర ఉపసంహరణ రూపాయిని కోలుకోలేని దెబ్బతీశాయి.

శుక్రవారం నాటి ఇంటర్‌బ్యాంక్‌ ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌లో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ఒక దశలో ఆల్‌టైం కనిష్ఠమైన 96.14కు పడిపోయింది. చివరకు గత ముగింపుతో పోలిస్తే 11 పైసలు క్షీణించి 95.86 (ప్రారంభం 95.87) వద్ద స్థిరపడింది. వరుసగా మూడో సెషన్‌లోనూ పతనమైన రూపాయి.. ఈ ఒక్క వారంలోనే 1.36 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తంగా 6 శాతం మేర క్షీణించి సరికొత్త రికార్డు కనిష్టాలను నమోదు చేసింది.

Indian Rupee Plummets to Record Low of 96 Against US Dollar Fuel and Import Costs Set to Rise Sharp

రూపాయిపై ముప్పేట దాడి.. కారణాలివే!

ప్రస్తుతం రూపాయి విలువ ఇంతలా పడిపోవడానికి అంతర్జాతీయంగా బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.

భౌగోళిక ఉద్రిక్తతలు - చమురు మంట:

మధ్యప్రాచ్యంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ల యుద్ధ వాతావరణం కారణంగా చమురు సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $107 సమీపంలో కొనసాగుతోంది. తన చమురు అవసరాల కోసం 90% పైగా దిగుమతులపైనే ఆధారపడే భారత్‌కు ఇది పెద్ద ఆర్థిక భారంగా మారింది.

రూపాయికి శాపం.. త్రిశూల వ్యూహంతో చరిత్ర చూడని పతనం..
రూపాయికి శాపం.. త్రిశూల వ్యూహంతో చరిత్ర చూడని పతనం..

బలపడుతున్న డాలర్ - ట్రెజరీ దిగుబడులు:

అమెరికాలో రిటైల్ విక్రయాలు పుంజుకోవడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కొత్త ఛైర్మన్ రేట్ల కోత విధిస్తారనే అంచనాల మధ్య డాలర్ ఇండెక్స్ మరింత బలోపేతమైంది. దీనికి తోడు అమెరికా 10-సంవత్సరాల ట్రెజరీ దిగుబడి దాదాపు ఏడాది కాలంలోనే అత్యధికంగా 4.50% దాటడంతో వర్ధమాన దేశాల కరెన్సీలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది.

దేశీయ మార్కెట్ల నుంచి నిధుల తరలింపు:

భారత ఈక్విటీ మార్కెట్ల నుండి విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) పెద్దఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. మరోవైపు చమురు మార్కెటింగ్ కంపెనీలు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, ఎగుమతిదారుల నుంచి డాలర్ల విక్రయాలు తగ్గడం సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచింది.

మధ్యతరగతిపై 'ద్రవ్యోల్బణం' భారం

కరెన్సీ విలువ జీవనకాల కనిష్ఠాలకు చేరడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక హెచ్చరిక లాంటిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో డాలర్‌ విలువ రూ.90 కాగా, ఇప్పుడు రూ.96కు చేరడంతో దిగుమతి చేసుకునే వస్తువులన్నీ ప్రియం కానున్నాయి. పెట్రోలు, డీజిల్‌ రిటెయిల్‌ ధరలు పెరిగితే రవాణా వ్యయం భారమై.. నిత్యావసరాలు, వంట నూనెలు, ప్యాకేజ్డ్‌ వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతాయి.

రూపాయి రక్తకన్నీరు: మోదీ హెచ్చరించిన మరుసటి రోజే!
రూపాయి రక్తకన్నీరు: మోదీ హెచ్చరించిన మరుసటి రోజే!

ఒక అంచనా ప్రకారం.. రూపాయి మారకపు విలువ 5.5% క్షీణిస్తే, నెలవారీ రూ.50,000 బడ్జెట్‌తో బండి నడిపే మధ్యతరగతి కుటుంబ కొనుగోలు శక్తి దాదాపు రూ.2,500 నుండి రూ.3,500 వరకు తగ్గుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే దేశ ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ సైతం పిలుపునిచ్చారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాల్లో (ముఖ్యంగా అమెరికాలో) ఉన్నత విద్య అభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులపై ఈ ప్రభావం పడనుంది. డాలర్ విలువ పెరగడంతో వారు చెల్లించే ఫీజులు, నెలవారీ జీవన వ్యయాల కోసం భారత్ నుండి పంపే డబ్బు భారం కానుంది.

రూ.100 మార్కు తాకితే పరిస్థితి ఏంటి?

రూపాయి మారకపు విలువ గనుక రూ.100 మార్కు వైపు కదిలితే భారత ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్‌పై అసాధారణ ప్రభావం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్టాక్స్‌కార్ట్ డైరెక్టర్, సీఈఓ ప్రణయ్ అగర్వాల్ విశ్లేషిస్తూ.. "బలహీనమైన రూపాయి ముడిచమురు, ఎలక్ట్రానిక్స్, రసాయనాల దిగుమతి వ్యయాన్ని పెంచి తీవ్ర ద్రవ్యోల్బణ ఒత్తిడికి దారితీస్తుంది. విమానయానం, FMCG, ఆటోమొబైల్స్ వంటి దిగుమతులపై ఆధారపడే రంగాలు మార్జిన్ ఒత్తిడిని ఎదుర్కొంటాయి. అయితే, ఇదే సమయంలో ఐటీ సేవలు, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్ వంటి ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు డాలర్ రూపంలో వచ్చే ఆదాయాలు పెరిగి లాభాలు చేకూరుతాయి" అని పేర్కొన్నారు. కరెన్సీ అస్థిరత నుంచి రక్షణ కోసం పెట్టుబడిదారులు కొంతమేర బంగారం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని, అయితే రూపాయి బలహీనపడితే దేశంలో బంగారం దిగుమతులు కూడా ఖరీదైనవిగా మారుతాయని ఆయన తెలిపారు.

నిపుణుల హెచ్చరిక.. ఆర్‌బీఐ జోక్యం అవసరం!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గి కాల్పుల విరమణ జరగకుంటే చమురు ధరల్లో కొత్త ర్యాలీ వచ్చే ప్రమాదం ఉందని ఇండస్‌ఇండ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది హెచ్చరించారు. స్వల్పకాలంలో రూపాయికి 96, 97 స్థాయిలు నిరోధకాలుగా (Resistances) ఉన్నాయని, ఒకవేళ అమెరికా-ఇరాన్ యుద్ధం ముదిరి ముడిచమురు (WTI) ధర బ్యారెల్‌కు $120 కి చేరితే రూపాయి రికార్డు స్థాయిలో 100 మార్కును తాకవచ్చని విశ్లేషకులు భయపడుతున్నారు. ఈ తరుణంలో భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్కెట్లోకి ప్రవేశించి జోక్యం చేసుకుంటేనే రూపాయికి కొంతమేర మద్దతు లభించి, మరింత పతనం కాకుండా అడ్డుకోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+