తెలంగాణా గ్రామాలకు 16వేలకోట్ల భారీ వరం... సీఎం రేవంత్ తో శ్రీకారం!
తెలంగాణా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడితే, అప్పుడు ఆ గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని భావించి గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి 16007 కోట్ల విలువైన భారీ రోడ్లు ప్రాజెక్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
హ్యామ్ విధానంలో రోడ్లు.. ప్రత్యేక పైలాన్ ఆవిష్కరణ
ఇక ఈ ప్రాజెక్టును హ్యామ్ విధానంలో చేపడుతున్నారు. ఆగస్టు 16వ తేదీన ములుగు జిల్లాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ ను కూడా సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కార్యక్రమం మంత్రి సీతక్క స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

హ్యామ్ విధానంలో చేసేది ఇదే
హ్యామ్ అంటే హైబ్రిడ్ ఆన్యుటీ మోడల్. ఇది రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేసే ఒక వ్యవస్థ. ఈ మోడల్ లో నిర్మాణానికి అయ్యే ఖర్చులో 40 శాతం ప్రభుత్వం భరిస్తే మిగిలిన 60 శాతం నిర్మాణ సంస్థలు సమకూర్చుకుంటారు. ప్రభుత్వం తన వాటాను 15 సంవత్సరాలలో 30 వాయిదాలుగా చెల్లిస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా 17300 కిలోమీటర్లు రోడ్లు మూడు దశలలో అభివృద్ధి
రోడ్లు పూర్తయిన తర్వాత 15 సంవత్సరాల పాటు ఆ రోడ్డు నిర్వహణ బాధ్యత కూడా అదే నిర్మాణ సంస్థపై ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి రోడ్డు నిర్వహణపై పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు కాకుండా, నాణ్యమైన రోడ్లు త్వరగా పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 17300 కిలోమీటర్లు రోడ్లను మూడు దశలలో అభివృద్ధి చేయనుంది.
96 నియోజకవర్గాల పరిధిలో 2162 రహదారులు ఆధునికీకరణ
మొదటి దశలో 96 నియోజకవర్గాల పరిధిలో 2162 రహదారులు ఆధునీకరించనున్నారు. గ్రామ పంచాయతీల మండలాలు, జిల్లా కేంద్రాలను కలిపేలా ఈ రోడ్లను ఎంపిక చేశారు . నిర్మాణ పనులను 30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 17 ప్యాకేజీల్లో 14 ప్యాకేజీలకు ఒప్పందాలు పూర్తి కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 16న శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఈ పనులు ఊపందుకుంటాయి.
హ్యామ్ గ్రామీణ రోడ్ల నిర్మాణంపై మంత్రి సీతక్క
హ్యామ్ విధానంలో చేపడుతున్న గ్రామీణ రోడ్ల నిర్మాణంపై మంత్రి సీతక్క మాట్లాడుతూ, రోడ్డు కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదని, పల్లెల జీవితాలను మార్చే మార్గమని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రైతులు, విద్యార్థులు, స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గతంలో రోడ్డు సౌకర్యం లేనిచోట కూడా ఈ విధానంలో రోడ్ల నిర్మాణం చేయటం ద్వారా ఆ ప్రాంతాల ప్రగతి సాధ్యమవుతుంది.












Click it and Unblock the Notifications