నైట్ టైమ్ నో పెట్రోల్!
దేశంలో పెరుగుతున్న ఇంధన సంక్షోభం, కరెన్సీ ఒత్తిడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన, విద్యుత్ పొదుపునకు ఒక వినూత్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పొదుపు చర్యలకు తమ వంతు మద్దతుగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం ట్రేడర్ల సమాఖ్య (APPFT) ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్ బంకుల నిర్వహణ సమయాలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
అయితే, అత్యవసర సేవల వాహనాలకు (ఆంబులెన్సులు, పోలీస్ వాహనాలు మొదలైనవి) మాత్రం ఎల్లప్పుడూ ఇంధనం అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబును కలిసి ఈ మేరకు ఒక అధికారిక వినతిపత్రాన్ని సమర్పించింది.

ప్రభుత్వం ప్రస్తుతం ప్రజారవాణా వ్యవస్థ బలోపేతం, కార్ పూలింగ్, ఎలక్ట్రానిక్ వాహనాల (EVs) వినియోగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని సమాఖ్య ప్రతినిధులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఐటీ, ఇతర రంగాలలో వర్క్ ఫ్రం హోం విధానం, వర్చువల్ సమావేశాలు పెరగడం వల్ల రాత్రివేళల్లో సాధారణ ప్రజల ఇంధన అవసరాలు గణనీయంగా తగ్గాయని వారు విశ్లేషించారు. అందువల్ల బంకులను రాత్రి 10 గంటలకే మూసివేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగబోదని అభిప్రాయపడ్డారు.
లక్ష యూనిట్ల విద్యుత్ ఆదా.. పరిశ్రమలకు ఊతం!
ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను సమాఖ్య అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ కమిషనర్‌కు వివరించారు. బంకుల సమయాలను పరిమితం చేయడం ద్వారా కేవలం ఇంధనమే కాకుండా పెద్దఎత్తున విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,900 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రాత్రివేళల్లో వీటిని మూసివేయడం ద్వారా హైమాస్ట్ లైట్లు, డిస్పెన్సింగ్ యూనిట్లు, సర్వర్ల వాడకం తగ్గుతుంది. ఫలితంగా ఒక్కో బంకులో రోజుకు సగటున 20 యూనిట్ల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు లక్ష యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుంది.
ఇలా ఆదా అయిన నాణ్యమైన విద్యుత్తును పరిశ్రమలకు మళ్లించడం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తిని మరింత పెంచవచ్చని సమాఖ్య సూచించింది. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఇంధన పొదుపు చర్యపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల కమిషనర్‌ను కలిసిన వారిలో సమాఖ్యకు చెందిన పలువురు కీలక ప్రతినిధులు పాల్గొన్నారు.














Click it and Unblock the Notifications