కొంపముంచిన లక్నో.. డేంజర్ జోన్‌లో సీఎస్కే!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన 59వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సునాయాసంగా ఘనవిజయం సాధించింది. హోరాహోరీగా సాగుతుందనుకున్న ఈ పోరులో లక్నో ఏకపక్షంగా సీఎస్కేను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో ఆటగాళ్లు కేవలం 16.4 ఓవర్లలోనే ఊదేయడం విశేషం. ఈ ఓటమితో సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
మిచెల్ మార్ష్ విధ్వంసం
లక్నో ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓపెనర్‌గా వచ్చిన మార్ష్ కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జోష్ ఇంగ్లిస్ (36)తో కలిసి మొదటి వికెట్‌కు 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కేవలం 38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు బాదిన మార్ష్.. దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. చివరలో నికోలస్ పూరన్ 17 బంతుల్లోనే 32 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

సీఎస్కే ప్లేఆఫ్స్ సమీకరణం ఇలా..!
ఈ ఓటమితో సీఎస్కే పాయింట్ల పట్టికలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్ల వద్దే నిలిచింది. ఇక మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌ల్లో సీఎస్కే తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అయితే రెండు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ నెట్ రన్ రేట్ కీలకంగా మారనుంది. మరోవైపు లక్నో ఈ విజయంతో 12 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లకు చేరుకున్నప్పటికీ.. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది.
తడబడిన టాపార్డర్.. కార్తీక్ శర్మ పోరాటం
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (13), సంజు శాంసన్ (20) విఫలమవడంతో సీఎస్కే ఒక దశలో 36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే యువ ఆటగాడు కార్తీక్ శర్మ (42 బంతుల్లో 71) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. అతనికి డెవాల్డ్ బ్రెవిస్ (25) సహకరించగ.., చివర్లో శివమ్ దూబే (16 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో సీఎస్కే గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
ముఖాముఖి రికార్డు
ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ చరిత్రలో సీఎస్కేపై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్‌లు జరగ్గా.. లక్నో 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. సీఎస్కే 3 మ్యాచ్‌ల్లో గెలవగా, ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా నిలిచిపోయింది. లక్నో బౌలర్లలో ఆకాష్ మహరాజ్ సింగ్ మూడు కీలక వికెట్లు తీసి చెన్నైని ఆరంభంలోనే దెబ్బకొట్టడం మ్యాచ్ మలుపు తిప్పింది.












Click it and Unblock the Notifications