ఉద్యోగులకు గుడ్ న్యూస్: 5 రోజుల పని దినాలు, పెండింగ్ బిల్లులు చెల్లింపు- పీఆర్సీ పైనా..!!
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు అయిదు రోజుల పని దినాల అమలు ప్రతిపాదన పైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా ఉద్యోగుల బకాయిల క్లియరెన్స్ వంద రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. మరో నెల రోజుల్లో పీఆర్సీ నివేదిక రాగానే.. ఉద్యోగులతో చర్చించి నిర్ణయం వెల్లడించనుంది. ఇక, ఉద్యోగుల హెల్త్ కార్డుల జారీ ముహూర్తం ఫిక్స్ చేసారు.
ఉద్యోగుల అంశాల పైన ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్థికేతర అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఉన్నతాధికారులను సీఎస్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు, డైరెక్టరేట్ల స్థాయిలో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులకు బదిలీల నిషేధం నుంచి మినహాయింపు కల్పించాలని ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్ కుమార్ సీఎ్‌సకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న వీఆర్‌ఏల కారుణ్య నియామకాలను పరిష్కరించాలని కోరారు. తొలగించిన ఔట్‌సోర్సింగ్ ఆపరేటర్ల విషయంపై మరోసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.

జూన్ 2 నాటికి ఉద్యోగులకు హెల్త్ కార్డులు
కాగా, ఉద్యోగులకు అయిదు రోజుల పని దినాల పని విధానాన్ని పరిశీలిస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. అదే సమయంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లు లు అన్నింటినీ వంద రోజుల్లో చెల్లించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. జూన్2 లోగా పీఆర్సీ పైనా నిర్ణయం తీసుకోవాలని.. పెండింగ్ లో ఉన్న అయిదు డీఏలను చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. కొత్త హెల్త్ స్కీం కోసం ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం వాటా.. అంతే మొత్తంలో ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ తో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ట్రస్టు ఆధ్వర్యంలో నడిపిస్తామని వెల్లడించారు. ఇక.. నెల రోజుల్లో పీఆర్సీ నివేదిక అందుతుందని.. ఆ తరువాత ఉద్యోగ సంఘాలను అహ్వానించి చర్చలు చేస్తామని చెప్పారు.













Click it and Unblock the Notifications