ఇరాన్ కు అండగా రష్యా: పుతిన్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన కారణంగా ప్రపంచదేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రయోజనాలకు అండగా రష్యా ఉంటుందని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడం కోసం తమకు సాధ్యమైనంత వరకూ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో జరిగిన సమావేశం సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఆయన సమావేశం అయ్యారు.
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు రష్యా తన వంతు కృషి చేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా సయ్యద్ మొజ్తాబా ఖమేనీ నుంచి తమకు సందేశం అందిందని పుతిన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజలు త్వరలోనే శాంతి రోజులను చూడబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తాజాగా రష్యా చేరుకున్నారు. అందుకుముందు ఆయన పాకిస్థాన్, ఒమన్ లలో పర్యటించిన విషయం తెలిసిందే. ప్రాంతీయ భద్రతతోపాటుగా ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై రష్యాతో ఏకాభిప్రాయం సాధించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం అని తెలుస్తోంది.

రష్యాలో పర్యటన నేపథ్యంలో అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో ఇరాన్ ఎప్పుడూ సన్నిహిత సంప్రదింపులు జరుపుతుందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు అవసరం ఉందని అరాగ్చీ స్పష్టం చేశారు. ప్రస్తుతం సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో పుతిన్ తో సమావేశం అయ్యారు అరాగ్చీ. ఆ తర్వాత రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తోనూ భేటీ కానున్నారు. మరోవైపు ఇరాన్- అమెరికా మధ్య చర్చల వేళ మూడు రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోవాలని లేకపోతే చమురు పైప్ లైన్లను పేల్చేస్తామని ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు యుద్ధం ముగించేందుకు, కాల్పుల విరమణకు కేవలం ఇంకా 3 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications