టారిఫ్ భారీగా పెంచిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబు పేల్చారు. యూరోపియన్ యూనియన్ నుండి అమెరికాలో దిగుమతి అయ్యే అన్ని రకాల కార్లు, ట్రక్కులపై ఇప్పుడున్న టారిఫ్ కు అదనంగా మరో 25 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని ఈయూ పాటించకపోవడం వల్ల ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో తన అభ్యంతరాలు ఏమిటో మాత్రం స్పష్టం చేయలేదు.
ట్రూత్ సోషల్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు ట్రంప్. యూరోపియన్ కార్ల తయారీదారులు తమ వాహనాలను అమెరికాలోనే ఉత్పత్తి చేస్తే ఈ టారిఫ్ నుంచి మినహాయింపు లభిస్తుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అనేక ఆటోమొబైల్, ట్రక్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని, వాటి విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అన్నారు. ఆయా పెట్టుబడులతో, కార్లు, ట్రక్కుల తయారీ జరగడం ఓ రికార్డుగా అభివర్ణించారు. అమెరికన్ కార్మికులతో పనిచేసే ఈ ప్లాంట్లు త్వరలో ఓపెన్ అవుతాయని పేర్కొన్నారు.

యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ గత ఏడాది జూలైలో ట్రేడ్ అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆ ఒప్పందాలను యూరోపియన్ యూనియన్ దేశాలేవీ కూడా అమలు చేయట్లేదనేది ట్రంప్ ఆరోపణ.నాటి ఒప్పందం ప్రకారం.. యూరోపియన్ కార్ మేకర్స్ ఆటోమొబైల్స్, విడిభాగాలతో సహా చాలా వస్తువులపై 15 శాతం టారిఫ్ ను చెల్లించాల్సి ఉంటుంది. స్కాట్లాండ్‌లోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్ పేరుతో టర్న్‌బెర్రీ అగ్రిమెంట్ గా పిలుస్తారు.
దీన్ని అమలు చేయట్లేదు యూరోపియన్ యూనియన్ దేశాలు. టారిఫ్ వ్యవహారం మొత్తం కూడా అమెరికా న్యాయస్థానాల్లో చిక్కుకోవడంతో ఈ అదనపు 15 శాతం టారిఫ్ చెల్లింపులను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోన్నాయి. ఈ వైఖరి పట్ల ట్రంప్ తాజాగా అసహనం వ్యక్తం చేశారు. 25 శాతం టారిఫ్ విధిస్తోన్నట్లు ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో తయారయ్యే అన్ని రకాల కార్లు, ట్రక్కులపై ఈ టారిఫ్ వర్తిస్తుందని వెల్లడించారు. అమెరికాలో వాటిని ఉత్పత్తి చేస్తేనే మినహాయింపు లభిస్తుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications