పాస్‌పోర్టులపై ట్రంప్ ఫోటో.. వైరల్ అవుతున్న డిజైన్!
అమెరికా ఆవిర్భవించి 250 ఏళ్లు పూర్తి కాబోతున్న తరుణంలో, ఈ జూలైలో జరగనున్న స్వాతంత్ర్య వేడుకలను చిరస్మరణీయం చేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖచిత్రం ఉన్న ప్రత్యేక పాస్‌పోర్టులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ స్వయంగా ధ్రువీకరించారు. ఇవి కేవలం పరిమిత సంఖ్యలో (Limited Edition) మాత్రమే అందుబాటులో ఉంటాయని, వీటికి అదనపు రుసుము ఏమీ ఉండదని వెల్లడించారు.
వైరల్ అవుతున్న డిజైన్..

ఈ ప్రత్యేక పాస్‌పోర్టులకు సంబంధించిన ఫోటోలను వైట్ హౌస్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అందులో అమెరికా స్వాతంత్ర్య ప్రకటన పత్రం నేపథ్యంలో ట్రంప్ ఫోటో ఉండగా, దాని కింద ఆయన సంతకం బంగారు రంగులో మెరుస్తోంది. మరొక వెర్షన్‌లో అమెరికా వ్యవస్థాపక పితామహుల (Founding Fathers) చారిత్రక చిత్రాలు ఉన్నాయి. సాధారణంగా దేశాలు తమ పాస్‌పోర్టులపై ప్రకృతి దృశ్యాలు లేదా జాతీయ చిహ్నాలను ముద్రిస్తాయి. కానీ, అధికారంలో ఉన్న నాయకుడి ఫోటోతో పాస్‌పోర్టు రావడం అమెరికా చరిత్రలోనే అత్యంత అరుదైన విషయంగా నిపుణులు చెబుతున్నారు.
వరుసగా ట్రంప్ మార్క్ నిర్ణయాలు..
కేవలం పాస్‌పోర్టులకే పరిమితం కాకుండా, ట్రంప్ పరిపాలన ఇతర విభాగాల్లోనూ తన ముద్ర వేస్తోంది.
- స్మారక నాణేలు: 250వ స్వాతంత్ర్య వేడుకల గుర్తుగా ట్రంప్ ముఖచిత్రంతో ప్రత్యేక కాయిన్స్ రూపొందుతున్నాయి.
- కరెన్సీ నోట్లు: అమెరికా కరెన్సీ నోట్లపై తన సంతకాన్ని ముద్రించబోతున్న తొలి అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు సృష్టించనున్నారు. ఈ మేరకు ట్రెజరీ శాఖ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం ఉన్న అమెరికా పాస్‌పోర్టులపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు ట్రంప్ ఫోటో ఉన్న పాస్‌పోర్టులు కూడా చేరనుండటంతో అమెరికన్లలో ఆసక్తి నెలకొంది.














Click it and Unblock the Notifications