హాలీవుడ్ ను సైతం చవులూరించే వైట్ హౌస్ డిన్నర్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారీ భద్రత లోపం సంభవించింది. ఫలితంగా వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ నుండి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర పరిపాలనా అధికారులను హుటాహుటిన సురక్షిత ప్రదేశానికి తరలించాల్సి వచ్చింది. డిన్నర్ కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి కాల్పులకు దిగటమే దీనికి కారణం. తక్షణమే అక్కడి వారందరూ తమ ప్రాణాలను రక్షించుకోవడానికి కిందికి వంగారు. కొందరు టేబుళ్ల కింద తలదాచుకున్నారు.
2,600 మంది అతిథులు..
వైట్ హౌస్ వార్తలను కవర్ చేసే ప్రెస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ కోసం ఏర్పాటు చేసిన డిన్నర్ ఇది. వాషింగ్టన్ లోని హిల్టన్ హోటల్ లో అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఏర్పాటైంది. దీనికి డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తో పాటు పలువురు వైట్ హౌస్ అత్యున్నత అధికారులు హాజరయ్యారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఉన్నారు. 2,600 మంది అతిథులు పాల్గొన్నారు.

వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్..
అమెరికా అధ్యక్షులు, వైట్ హౌస్‌ను కవర్ చేసే జర్నలిస్టులు కలిసి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ (WHCA)ను స్థాపించారు. 1914 ఫిబ్రవరి 25న ఇది ఆవిర్భవించింది. వైట్ హౌస్ లో నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, ఇతర అధికారిక కార్యకలాపాలను కవర్ చేసే జర్నలిస్టులను అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ ఎంపిక చేస్తుందన్న నిరాధార వదంతుల ప్రతిస్పందనగా ఈ సంస్థ ఏర్పాటైంది.
వైట్ హౌస్ ప్రెస్ యాక్టివిటీస్..
వైట్ హౌస్ నుండి స్వతంత్రంగా పనిచేస్తుంది.. డబ్ల్యూహెచ్‌సీఏ. ఈ అసోసియేషన్ లో సభ్యత్వ దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తారు. నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉంటేనే వాటిని ఆమోదిస్తారు. వైట్ హౌస్ వార్తలను ఎవరు కవర్ చేయాలి, ఆయా జర్నలిస్టుల అర్హతలు, వారి గుర్తింపు, నేరుగా అధ్యక్షుడిని కలిసే అవకాశం, ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ ఎంపిక వంటి కీలక అంశాలను ఇదివరకు ఈ సంస్థ స్వయంగా పర్యవేక్షించేది. ఆ తర్వాత ఇది చేతులు మారింది. ఈ కార్యకలాపాలను వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ పర్యవేక్షిస్తారు.
WHCD అంటే..
ఈ వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ కు ప్రతి సంవత్సరం కూడా అధ్యక్షుడు స్వయంగా డిన్నర్ ఏర్పాటు చేస్తారు. 1921 నుంచీ ఇది ఆనవాయితీగా వస్తోంది. దీన్నే వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ (White House Correspondents' Dinner- WHCD) గా పిలుస్తారు. మీడియా, అడ్మినిస్ట్రేషన్ మధ్య ఓ వారధిగా ఈ డిన్నర్ ను భావిస్తారు. 1924లో అప్పటి అధ్యక్షుడు కెల్విన్ కూలిడ్జ్ స్వయంగా హాజరయ్యారు. అప్పటి నుండి, దాదాపు ప్రతి అధ్యక్షుడూ ఈ విందుకు హాజరవుతూ వస్తోన్నారు.
హై- వెలాసిటీ ప్రోగ్రామ్..
అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రముఖ జర్నలిస్టులు, పరిమితంగా ఎంపిక చేసిన అమెరికన్ హాలీవుడ్ నటులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపై కలుస్తారీ డిన్నర్ ద్వారా. ఈ డిన్నర్ ద్వారా వచ్చే నిధులతో జర్నలిస్టుల కోసం వినియోగిస్తారు. రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్‌మెంట్, పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యతపై కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే కొత్త తరానికి చెందిన జర్నలిస్టులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తారు.
ఫస్ట్ టైమ్ ట్రంప్..
డిన్నర్ టిక్కెట్లను విక్రయించరు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న వార్తా సంస్థలకు మాత్రమే అవి అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ హాజరు కావడం ఇదే తొలిసారి. 2016- 2020 మధ్యకాలంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడే గానీ వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కు హాజరు కాలేదు. ఇప్పుడు మెలానియాతో కలిసి హాజరయ్యారు. అదే సమయంలో కాల్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications