అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్‌తో గ్లోబల్ స్టార్‌గా..!
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య శనివారం కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ వంటి హేమాహేమీలు ఈ సమావేశంలో పాల్గొంటుండగా.. అందరి దృష్టి మాత్రం ఓ మహిళా అధికారిపై పడింది. జేడీ వాన్స్ పాకిస్థాన్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన వెంటే ఉంటూ.. అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఆ మహిళా దౌత్యవేత్త పేరు నైట్లీ బేకర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
అమెరికా ప్రతినిధిగా కీలక పాత్ర
నైట్లీ బేకర్ కేవలం ఓ అధికారి మాత్రమే కాదు.. ఈ మొత్తం చర్చల వెనుక ఆమె కృషి ఎంతో ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో తాత్కాలిక రాయబారిగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేడీ వాన్స్ ఇస్లామాబాద్ చేరుకోవడానికి ముందే.. ఆమె ఇక్కడి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. అమెరికా ప్రతినిధి బృందం భద్రత విషయంలో పాక్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీతో భేటీ అయి అమెరికాకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడంలో నైట్లీ బేకర్ కీలక పాత్ర పోషించారు.

అపారమైన దౌత్య అనుభవం
నైట్లీ బేకర్ దౌత్యవేత్తగా సుదీర్ఘ అనుభవం కలిగిన వారు. ఆగస్టు 2024లో ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు 2021 నుండి 2024 వరకు ఖతార్‌లోని దోహాలో కూడా ఇదే పదవిలో పనిచేశారు. అలాగే అమెరికా విదేశాంగ శాఖలో నార్త్ ఆఫ్రికన్ అఫైర్స్ డైరెక్టర్‌గా.. లిబియా, దుబాయ్, కువైట్ వంటి దేశాల్లో అమెరికా మిషన్లలో వివిధ హోదాల్లో సేవలు అందించారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్ వ్యవహారాల్లో ఆమెకు మంచి పట్టు ఉంది.
విద్యా అర్హతలు, సోషల్ మీడియా క్రేజ్:
నైట్లీ బేకర్ విద్యార్హతలు కూడా చాలా ఉన్నతమైనవి. ఆమె ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని, ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 2017లో నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీకి చెందిన నేషనల్ వార్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఇస్లామాబాద్ చర్చల్లో ఆమె మేధస్సు కంటే, ఆమె అందం గురించి పాకిస్థానీ సోషల్ మీడియా యూజర్లు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అయినప్పటికీ అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ చారిత్రాత్మక చర్చల విజయవంతంలో ఆమె పాత్ర అత్యంత కీలకం కానుంది.












Click it and Unblock the Notifications